పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 3 వరకు జరిగే ఈ సమావేశాల్లో సుమారు 45 బిల్లులు, 7 ఆర్థిక పద్దులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. బ్యాంకులు దివాలా తీయడం, ఖనిజ సవరణ చట్టాలు-2019 ఆర్డినెన్స్ లను కూడా ఉభయసభల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సరోగసీతో పాటు పలు వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సమావేశాల్లో.. ఢిల్లీ అల్లర్ల అంశమే ప్రధానంగా ఫోకస్‌ కానుంది. ఈ హింసాత్మక ఘటనలపై మోదీ సర్కారుపై ఎదురుదాడి చేయాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఢిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని ఇప్పటికే డిమాండ్‌ చేశాయి. అయితే.. విపక్షాల వ్యూహలకు కౌంటర్‌ ఇచ్చేందుకు కేంద్రం సైతం రెడీ అవుతోంది. విపక్షాల తప్పుడు ప్రచారం వల్లే అల్లర్లు జరుగుతున్నాయంటూ కౌంటర్ అటాక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు.

ఇక ఈ సమావేశాల్లో... తెలుగు రాష్ట్రాలు సైతం పలు అంశాలను లెవనెత్తేందుకు రెడీ అవుతున్నాయి. ప్రధానంగా అమరావతి రాజధాని మార్పు, రైతులపై ప్రభుత్వ అణిచివేత అంశాలపై పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు తెలుగుదేశం సమాయత్తమైంది. కేంద్ర పెద్దలను కలిసి ఏపీ పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరనుంది టీడీపీ. అటు.. ఇప్పటికే సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని నిర్ణయించింది. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాపైనా కేంద్రాన్ని నిలదీయనుంది టీఆర్‌ఎస్‌.

Tags

Next Story