ఆంధ్రప్రదేశ్

దద్దరిల్లుతున్న అమరావతి గ్రామాలు

దద్దరిల్లుతున్న అమరావతి గ్రామాలు
X

అమరావతిలో ఉద్యమసెగలు ప్రజ్వరిల్లుతున్నాయి. రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు రైతులు. 77వ రోజూ 29 గ్రామాల్లోనూ నిరసనలు హోరెత్తాయి...మందడం, తుళ్లూరు, మహాధర్నాలు వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులోని శిబిరాలు జై అమరావతి నినాదాలతో దద్దరిల్లుతున్నాయి.

మహిళలు ముందుండి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు.ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతుంటే వందలాది మందిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు.

హనుమాన్ చాలీసా, జలదీక్ష, వంటావార్పు, బ్యాక్‌వాక్ ఇలా రోజుకో రితీలో నిరసన తెలుపుతున్నారు రైతులు.. అలుపెరగని పోరాటం చేస్తున్న రైతులకు ఇతర జిల్లాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది రైతుల వెనుకే ఉన్నారన్న భరోసా ఇస్తున్నారు.

77 రోజులుగా రాజధాని గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. సర్కారు తీరుపై మండిపడుతున్న రైతులు...జగన్ దిగివచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు.. ప్రాణత్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. రైతుల త్యాగాన్ని గుర్తించి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైతు కన్నీరు కార్చిన ఏ రాష్ట్రం అభివృద్ధి చెందలేదనే విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు .

Next Story

RELATED STORIES