77వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం 77వ రోజుకు చేరింది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు రాజధాని రైతులు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు స్పష్టం చేశారు. మందడంలో రైతుల దీక్షా శిబిరానికి రైతులు పెద్దయెత్తున తరలివచ్చారు.
వెలగపూడిలోనూ రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు కూడా దీక్షా శిబిరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం కుట్రతోనే రాజధాని మార్పు చేపట్టిందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరతామన్నారు తుళ్లూరు రైతులు. అటు.. రాజధాని రైతులకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.
అమరావతి ఉద్యమానికి ఓ వ్యక్తి వినూత్నరీతిలో మద్దతు తెలిపారు. శివుని వేషధారణలో వెలగపూడి శిబిరానికి వచ్చిన రాఘవేంద్రరావు అనే వ్యక్తి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. అటు పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మాకినేని పెదరత్తయ్య రైతుల ఉద్యమానికి చేయూతనిచ్చారు. బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు.
రాజధాని తరలింపు ఆపే శక్తి కేంద్రానికే ఉందన్నారు అమరావతివాసులు. రాష్ట్ర స్థాయిలో తాము 76 రోజులుగా ఉద్యమిస్తున్నా, విపక్షాలన్నీ మద్దతు ఇస్తున్నా YCP ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.YCP మంత్రులు, నేతల ప్రకటనలతో మనస్తాపం చెంది 49 మంది చనిపోయారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని 29 గ్రామాల్లోని సకల జనులతోపాటు వివిధ జిల్లాల్లో అమరావతికి మద్దతుగా చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. లక్షలాది మంది 76 రోజులుగా ఉద్యమిస్తున్నా CM జగన్ పట్టించుకోకపోవడం.. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారనడానికి నిదర్శనమన్నారు రైతులు. తాము కూడా ఇంతే మొండిగా ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com