స్థానిక సంస్థల రిజర్వేషన్‌పై ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌పై.. ఏపీ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85 శాతం కోటా కల్పించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. దీనికి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికి పైగా రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. నెలలోపు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో.. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలు రావడంతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు జిల్లా స్థాయిల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని హైకోర్టు ఆదేశించడంతో దానికి తగ్గట్టు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది.
ఏపీలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, పురపాలక, నగరపాలక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. వీటికి మార్చిలోపు ఎన్నికలు పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఇబ్బందుల్లేకుండా తేదీలు ఖరారు చేయడంపై దృష్టి పెట్టినా ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టంగానే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 4వ తేదీ నుంచి 23 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. తర్వాత టెన్త్ పరీక్షలు ఉంటాయి. టీచర్లంతా ఇన్విజిలేషన్ డ్యూటీల్లో ఉంటే ఎన్నికల సిబ్బంది దొరికే అవకాశమే లేదు. గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవాలని భావిస్తున్నా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి 15 నుంచి నిర్వహించనున్నారు. ఈ లెక్కన చూస్తే మార్చి చివరి వారంలో తప్ప అంతకుముందు ఎన్నికలు కష్టమేనన్న భావన ఉంది.
మరోవైపు.. మార్చి నెలాఖరు నాటికి 14వ ఆర్థిక సంఘం గడువు ముగుస్తుంది. అప్పటికల్లా ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయకపోతే గ్రామపంచాయతీలకు రావాల్సిన 3 వేల 400 కోట్లకుపైగా నిధులు.. పురపాలక సంఘాలకు సంబంధించి 1400 కోట్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే నెలాఖరుకల్లా ఎన్నికలు పూర్తి చేసే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఆగిపోతే మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో ఆగమేఘాలపై హైకోర్టు తీర్పును అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఏపీ సర్కారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com