గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో కోవిడ్-19 బాధితుడికి ట్రీట్‌మెంట్

గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో  కోవిడ్-19 బాధితుడికి ట్రీట్‌మెంట్

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపుత్రిలో కోవిడ్-19 బాధితుడికి ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది. ప్రత్యేక వార్డులో ఉంచి బాధితుడిని పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి హాంకాంగ్ సహచరుల ద్వారా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. టూర్‌ నుంచి తిరిగి వచ్చాక జలుబు, జ్వరం రావడంతో అతడు అపోలో ఆసుపత్రిలో చేరాడు. కానీ అక్కడ ఎంతకీ తగ్గకపోవడంతో.. అక్కడి వైద్యుల సూచనల మేరకు.. గాంధీ ఆసుపత్రిలో చేరడంతో వెంటనే వైద్యపరీక్షలు చేశారు. రిపోర్ట్‌ల ఆధారంగా వైరస్ నిర్థారణ కావడంతో చికిత్స అందిస్తున్నారు.

కోవిడ్-19 బాధితుడి ద్వారా మరెవరికైనా వ్యాధి సోకి ఉంటుందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరులో అతను ఎవరెవరితో కలిశాడు వంటి వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు ఆ వ్యక్తి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో రావడంతో.. తోటి ప్రయాణికుల ఇళ్లకు వెళ్లి అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రయాణికులతోపాటు.. అతడి బంధువులు మొత్తం 80 మంది ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నారు. వీళ్లందరితోపాటు.. అపోలో ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స చేసిన వైద్యుల పరిస్థితిపైనా ఆరా తీస్తున్నారు. జలుబు, జ్వరానికి ట్రీట్‌మెంట్‌ చేసినపుడు.. వారిలో ఎవరికైనా వైరస్‌ సోకి ఉంటుందేమోనని విచారిస్తున్నారు.

గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం మరో ముగ్గురు కోవిడ్-19 అనుమానితులు చేరారు. వైద్య సిబ్బంది ప్రత్యేక ఆంబులెన్స్‌లో అనుమానితులను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ముగ్గురికి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలు వచ్చాకే.. కోవిడ్-19సోకినట్టు స్పష్టత వస్తుందన్నారు వైద్యులు.

Tags

Read MoreRead Less
Next Story