తెలంగాణలో ప్రవేశించిన కోవిడ్-19.. తెలుగు రాష్ట్రాలలో ఆందోళన
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలోకి ప్రవేశించింది. భారత్‌లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపారు మంత్రి హర్షవర్దన్. ఆదివారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐదుగురికి కోవిడ్-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌గా తేలిందని.. ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. వీరిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కోఠిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి ఈటెల.. కరోనా సోకిన వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై చర్చించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మరోవైపు.. ఇటీవల బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రముఖ సామాజిక కార్యకర్త సునితా కృష్ణన్.. కరోనా అనుమానంతో గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమెను ఐసోలేషన్ వార్డులో ఉంచి.. మానిటరింగ్ చేస్తున్నారు వైద్యులు. అటు ఇతర రోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ తమకూ సోకుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు.
మొత్తానికి.. కోవిడ్ 19 వైరస్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన మొదలైంది. ఒకసారి ఈ వైరస్ వస్తే.. భారీగా ప్రాణనష్టముంటుందనేది ఇప్పటికే చైనాను చూస్తే తెలుస్తోంది. దీంతో... ఈ వ్యాధిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com