వరుసగా మూడోసారి నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా

వరుసగా మూడోసారి నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా

నిర్భయ దోషులకు భూమిపై ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి. చట్టం కల్పించిన వెసులుబాట్లు, న్యాయం అమలులో లోపాలు దోషుల ఆయుష్షును పెంచుతున్నాయి. వరుసగా మూడోసారి దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. మూడో డెత్ వారెంట్ కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలు ముగిసిపోలేదంటూ మరణశిక్ష అమలును ఆపేశారు. అన్ని ప్రత్యామ్నాయాలు ముగిసిన తర్వాతే ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

వాస్తవానికి ఈనెల 3వ తేదీన నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉంది. ఐతే, మరణశిక్షను ఆపడానికి దోషులు మరో సారి ప్రయత్నించారు. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్లు వేశారు. అక్షయ్ కుమార్ ఢిల్లీ హైకోర్ట్‌ ను ఆశ్రయించగా, పవన్ గుప్తా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. డెత్ వారెంట్‌ స్టే ఇవ్వాలని హైకోర్టును అక్షయ్ కుమా ర్ అభ్యర్థించగా, ఉరిశిక్ష అమలును నిలిపివేయాలని సుప్రీంకోర్టును పవన్ గుప్తా అభ్యర్థించాడు. వారిద్దరి పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. మరణశిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించాయి. మంగళవారం ఉదయం ఉరిశిక్ష అమలు చేయాల ని ఆదేశించాయి. దీంతో నిర్భయ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు దోషులకు శిక్ష అమలవుతోందీ అని సంబరపడ్డారు. కానీ, ట్రయల్ కోర్టులో వారికి షాక్ తగిలింది.

ఢిల్లీ పటియాలా కోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలు ముగిసిపోలేదని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఒక దోషి మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు ముగియకుండా శిక్ష ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. నిప్పుతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టంలోని వె సులుబాట్లను ఉపయోగించుకుంటూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తప్పుపట్టింది. కానీ, మంగళవారం నాడే తప్పనిసరిగా శిక్షను అమలు చేసి తీరాలని చెప్పలేకపోయింది. చట్ట ప్రకారం వ్యవహరించాల్సి ఉండడంతో మరణ శిక్ష అమలుపై స్టే విధించింది. మళ్లీ డెత్ వారెంట్ జారీ చేసిన తర్వాతే శిక్ష అమలు చేయాలని సూచించింది.

నిర్భయ దోషులకు మొత్తంగా మూడు డెత్‌వారెంట్లు జారీ అయ్యాయి. తొలుత జనవరి 7న ఫస్ట్ డెత్ వారెంట్ ఇష్యూ చేశారు. జనవరి 22 ఉదయం 5 గంటలు శిక్ష అమలు చేయాలని బ్లాక్ వారెంట్‌లో పేర్కొన్నారు. అప్పుడు శిక్ష అమ లు కాలేదు. దాంతో సెకండ్ డెత్ వారెంట్ జారీ చేశారు. ఫిబ్రవరి 1న నలుగురిని ఉరి తీయాలని ఆదేశించారు. అప్పుడు కూడా శిక్షను అమలు చేయలేకపోయారు. దాంతో ఫిబ్రవరి రెండోవారంలో మూడోసారి డెత్ వారెంట్ జారీ చేశారు. మార్చ్ 3న ఉదయం 6 గంటలకు నలుగురికి మరణశిక్ష అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. మూడో సారి కూడా ఉరిశిక్ష అమలు ముచ్చట తీరలేదు.

Tags

Read MoreRead Less
Next Story