భీమవరంలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు

భీమవరంలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. అభివృద్దిపై బహిరంగ చర్చకు నాయకులు సవాలు విసురుకోవడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించారు. నాలుగు రోజులక్రితం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ కోటికల పూడి గోవిందరావు సవాలు విసిరారు. పట్టణంలో జరిగిన అభివృద్ది పై ఈనెల 3వ తేదీ మున్సిపల్ ఆఫీసు ముందు గాంధీ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలన్నారు. దీంతో పోలీసులు మంగళవారం నుంచి ఈరోజు సాయంత్రం వరకు పట్టణంలో 144 విధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా మున్సిపల్ ఆఫీసు వద్దకు వైసీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు రాకుండా చర్యలు తీసుకున్నారు.

సవాలు, ప్రతిసవాలు నేపధ్యంలో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా స్థానిక జనసేన, వైసీపి నాయకుల ఇళ్లముందు భారీగా మోహరించారు. ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు గాంధీ సెంటర్ కు రాకుండా అడ్డుకున్నారు. మరికొంతమందిని హౌజ్ అరెస్టుచేశారు. అయితే పోలీసులు ఎంతమోహరించినా వైసీపి, జనసేన నాయకుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఇరుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలమధ్య ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story