తెలగాణలో జోరుగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం

తెలగాణలో జోరుగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం

పట్టణాల రూపు రేఖలు మార్చేలా పట్టణ ప్రగతిలో స్పీడు పెంచుతున్నారు తెలంగాణ మంత్రులు. ఇటీవలె ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లకు సూచనలు ఇస్తూ పట్టణాల్లో అద్భుతమైన మౌళిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సిద్ధిపేటలో పర్యటించిన మంత్రి హరీష్ రావు..14 వార్డులో హౌజింగ్‌ బోర్డు కాలనీలో నూతన రైతు బజార్‌ను ప్రారంభించారు. పట్టణాల్లో చెత్త అతిపెద్ద సమస్యగా మారిందని.. మన ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. వీధిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటినీ పట్టణప్రగతి కార్యక్రమాల్లో మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా.. పలు వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వైరా రిజర్వాయర్‌లో ఆనకట్టపై నిర్మిస్తున్న ట్యాంక్‌బండ్‌ పనులను మంత్రి పరిశీలించారు. 2 నెలల క్రితం 20 కోట్ల రూపాయలతో.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినా నేటికీ పనులు ప్రారంభించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా.. 2 కోట్ల 64 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 70 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని ప్రజా ఉపయోగాలకు కేటాయించామన్నారు మల్లారెడ్డి. లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

కొత్త పంచాయితీరాజ్ చట్టం ముందు.. ఎవరు అవినీతికి పాల్పడినా తప్పించుకోలేరని.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని వైట్‌హౌజ్ కన్వెన్షన్ హాల్‌లో పల్లెప్రగతిపై ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి పంచాయితీరాజ్‌ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సర్పంచ్‌లు మంచి పనులు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో మున్సిపాలిటీలు, పంచాయితీల దశ మారుతుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. వార్డు కమిటీలు మరింత చొరవగా పాల్గొని మౌళిక సౌకర్యాల కల్పనలో క్రీయాశీలంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

Tags

Next Story