జగన్ అనే వైరస్‌తో బాధపడుతున్నాం: రైతులు
అమరావతిలో రాజధాని ఉద్యమం రోజురోజుకీ ఉద్ధృతం అవుతోంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా రైతులు, మహిళలు పోరాటం కొనసాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వరుసగా 78వ రోజూ 29 గ్రామాల్లోనూ నిరసనలు హోరెత్తాయి. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు.. వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులోని శిబిరాలు జై అమరావతి నినాదాలతో దద్దరిల్లాయి. 151 మంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మెరుగైన పాలన చేస్తారనుకుంటే..తమ జీవితాలు రోడ్డున పడేశారంటూ ఫైర్ అయ్యారు రైతులు.
మందడంలో రైతులు మాస్క్‌లు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో బాధపడుతుంటే.. తాము జగన్ వైరస్‌తో బాధపడుతున్నామని విమర్శించారు. జగన్ తన స్వార్ధం కోసమే మూడు రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. విశాఖలో భూములు ఇచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారని ఆరోపించారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం చేసుకున్న ఒప్పందాలను.. చెల్లవని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మంత్రులు తమ శిబిరాలకు ఎందుకు రావడం లేదని నిలదీశారు రైతులు.
తుళ్లూరులో మహిళలు ఆందోళనలతో హోరెత్తించారు. మధ్యాహ్నం భోజన సమయంలో గరిటలతో పళ్లెంపై కొడుతూ నిరసన వ్యక్తం చేశారు..ప్రభుత్వం తమ ఆవేదన పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత గుడ్డి,చెవిటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.
మరికొందరు మహిళలు దీక్షా శిబిరం వద్ద పళ్లు అమ్మారు. 78 రోజులుగా ఆందోళనలు చేయడం వల్ల ఉపాధి కోల్పోయామని.. మానసికంగానూ తీవ్రమైన క్షోభ అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిరుపేదలైన దళితుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు.
అమరావతే ఊపిరిగా ఉద్యమం కొనసాగుతోంది. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత పాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచి విశాఖ తరలించేస్తారన్న వార్తలతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. చిన్న చిన్న పనులు పూర్తి చేస్తే అమరావతి నుంచే పూర్తిస్థాయిలో పాలన సాగించుకునే అవకాశం ఉన్నా ఎందుకిలా కక్ష కట్టారో అర్థం కావడంలేదంటున్నారు.
అమరావతి గొంతుక అంతర్జాతీయ వేదికలపైనా వినిపిస్తోంది. రైతుల ఆవేదన, ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెబుతున్నారు అమెరికా NRIలు. అమరావతిలో రైతులు, మహిళలపై జరుగుతున్న దమనకాండ, హక్కుల ఉల్లంఘనలపై జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు NRI శ్రీనివాసరావు కావేటి. వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలలను ఫిర్యాదులో ప్రస్తావించారు. అటు ఇంతకు ముందే నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలోనూ అమరావతి అంశంపై ఫిర్యాదు చేశారు శ్రీనివాసరావు కావేటి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com