ఆంధ్రప్రదేశ్‌ను కలవరపెడుతోన్న కరోనా వైరస్!
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను కలవరపెడుతోంది. కరోనా లక్షణాలతో ఏపీలో 11 అనుమానిత కేసులు నమోదయ్యాయి. విశాఖలో 5, శ్రీకాకుళంలో 3, ఏలూరు, విజయవాడ, కాకినాడల్లో ఒక్కో కేసు నమోదైంది. కరోనా అనుమానిత కేసులతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అనుమానితులను వెంటనే ఆస్పత్రులకు తరలించి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందించారు. ఇప్పటి వరకు సేకరించిన 11 మంది నమూనాలు నెగటివ్ వచ్చినట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన 8 మంది నమూనాలను పుణెకు పంపినట్లు వివరించింది. సింగపూర్, బహ్రెయిన్ నుంచి వచ్చిన ఐదుగురికి విశాఖ ఛాతీ ఆస్పత్రిలో, దక్షిణ కొరియా నుంచి వచ్చిన వ్యక్తికి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది.
విశాఖలో ఓ కుటుంబానికి జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. భార్యాభర్తలు, కుమార్తెకు జలుబు, దగ్గు రావడంతో చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రక్త నమూనాలను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. బెజవాడకు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్ లక్షణాలను కనిపించటం కలవరం కలిగించింది. ఉద్యోగ రీత్యా హైదరా బాద్‌లో స్థిరపడిన ఇతను, ఇటీవల జర్మనీలో 17 రోజులు బసచేసినట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రి లో 2 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఒకరు మస్కట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. అయితే..కరోనా టెస్టుల్లో అందరికీ నెగటీవ్ వచ్చింది.
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వదంతులు ప్రజలను భయపెడుతున్నాయి. ఇటీవలె దబాయ్, కువైట్ నుంచి వచ్చిన ముగ్గురికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు. వారే స్వయంగా వెళ్లి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అయితే..వారి బ్లడ్ షాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com