తెలుగు రాష్ట్రాల్లో మాస్క్‌ల ధరకు రెక్కలు వచ్చాయి!
కరోనా భయంతో ప్రజలు టెన్షన్ పడుతుంటే ఇదే అదనుగా మెడికల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాస్క్‌ల ధరకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కేవలం 2 రూపాయలకే దొరికే సాధారణ సర్జికల్ మాస్క్‌ను 10 నుంచి 20 రూపాయలకు అమ్ముతున్నారు. 50 రూపాయలకు దొరికే N95 మాస్క్‌లను 3 వందలకు అమ్ముతున్నారు.
కరోనా సీజన్ ను క్యాష్ చేసుకుంటున్నారు మెడికల్ స్టోర్స్ వ్యాపారులు. ప్రాణాంతక మహమ్మారిపై పోరాటంలో తమ వంతు సాయం చేయాల్సింది పోయి..ఇదే అదనుగా కక్కుర్తి చూపిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటంలో మాస్క్ లు కీలకం కావటంతో జనం మెడికల్ షాపులకు ఎగబడుతున్నారు. ముందస్తుగానే మాస్క్ లు కొనుక్కుంటున్నారు. దీంతో మాస్క్ లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న మెడికల్ స్టోర్స్ వ్యాపారులు మాస్క్ రేట్లను అమాంతంగా పెంచేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మాస్క్ ల ధరలకు రెక్కలు వచ్చాయి.
ఓ వైపు ప్రాణాంతక వైరస్ ప్రమాదం పొంచి ఉంటే మెడికల్ స్టోర్స్ వ్యాపారులు ఈ సమయంలో దోపిడికి పాల్పడటంపై జనంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్క్ ల విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నారు. కరోనా గండం గట్టెక్కే వరకు ప్రభుత్వమే ఉచితంగా మాస్క్ లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com