5 March 2020 3:59 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / కరోనావైరస్ పుణ్యమాని...

కరోనావైరస్ పుణ్యమాని పలకరింపు విధానంలో మార్పు..

కరోనావైరస్ పుణ్యమాని పలకరింపు విధానంలో మార్పు..
X

కరోనావైరస్ వ్యాప్తి తరువాత ప్రజలు ఒకరినొకరు అసాధారణ పద్ధతిలో పలకరించుకుంటున్నారు. చేతులు కలుపుకోవడం లేదా కౌగిలించుకోవడం వంటి పద్దతులను మానేస్తున్నారు. చైనా నగరమైన వుహాన్‌లో ప్రజలు వినూత్న రీతిలో పలకరించుకుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వుహాన్ లో ప్రసిద్ది చెందిన ప్రాంతంలో ప్రజలు వారి పాదాలను మరొకరి పాదాలతో తాకి ఒకరినొకరు పలకరించుకుంటున్నారు.

ఈ ఉల్లాసభరితమైన విధానాన్ని ఇరాన్‌లోని చాలా మంది పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరగడంతో, ప్రజలు ఇప్పుడు సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా చేతులు కలుపుకోవడం లేదా ఒకరినొకరు కౌగిలించుకోవడం మానేసి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. చేతులు కలుపుకోవడం వలన ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో అన్న భయంతో ఇలా చేస్తున్నారు.

ఇదిలావుంటే ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఒక వీడియోలో, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తన అంతర్గత మంత్రి సమావేశంలో హ్యాండ్‌షేక్ తిరస్కరించినట్లు కనిపిస్తారు.. దీనిని “సరైన పని”కాదు అని చెప్పడం అందులో చూడవచ్చు. సాధారణంగా భారతదేశంలో అయితే ప్రజలు నమస్తే అని రెండు చేతుల ద్వారా దండం పెట్టి సాంప్రదాయ రీతిలో పలకరిస్తారు. ఇప్పటికి దేశంలో ఈ సంప్రదాయాన్ని 50 శాతానికి పైగా ప్రజలు పాటిస్తున్నారు.

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే వారం హోలీ వేడుకలకు దూరంగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరకు పలువురు భారత ప్రముఖులు చెప్పారు. కాగా కరోనా వైరస్ భారతదేశంలో దాదాపు 30 మందికి సోకింది, అయితే ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా, 70 కి పైగా దేశాలలో వేలాది మంది సోకడంతో 3,000 మందికి పైగా మరణించారు.

ఇదిలావుంటే కరోనావైరస్(కోవిడ్ -19) వ్యాప్తి గురించి భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. భారత్ లో కరోనా వైరస్ పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రోడ్రికో ఆఫ్రిన్ మాట్లాడుతూ.. భారతదేశంలో పాజిటివ్‌గా పరీక్షించిన కేసులు అన్ని కూడా విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి వల్లే వచ్చాయని.. భారత్ లో వైరస్ ఉద్భవించలేదని అందువల్ల భారతీయులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story