రాజధాని గ్రామాల్లో ప్రతిధ్వనిస్తున్న జై అమరావతి నినాదం
జై అమరావతి.. జైజై అమరావతి నినాదాలు రాజధాని గ్రామాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఉద్యమం 79వ రోజుకు చేరినా.. రైతుల పోరాటంలో అదే దూకుడు కన్పిస్తోంది. రాజధాని కోసం రైతులు, మహిళలు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డులోని శిబిరాల్లో జై అమరావతి నినాదాలు మిన్నంటాయి.
ఇప్పటికైనా 3 రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గాలని లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు రైతులు. రైతులు రోజుకో రూపంలో నిరసనలు తెలుపుతున్నారు. పెదపరిమిలో హనుమాన్ ఛాలీసా నిర్వహించారు.. జగన్ మనసు మార్చాలని వేడుకున్నారు. తాడికొండ అడ్డరోడ్డులో చేతులకు సంకెళ్లు వేసుకొని...నల్లబెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి రాజధాని రైతులపై ఎందుకింత కక్షో అర్థం కావడం లేదన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు పురుగుల మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఆర్‌డీఏ అధికారులు వస్తున్నారనే సమాచారంతో ఆందోళన చేపట్టారు. పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ‘సీఆర్‌డీఏ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. తాము రాజధాని అభివృద్ధి కోసం భూములు ఇచ్చామని.. పేదల ఇళ్ల స్థలాల కోసం కాదని అన్నారు..ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఈ భూముల్లోనే పురుగుల మందు తాగి ఆత్మబలిదానం చేసుకుంటామని హెచ్చరించారు.
టీడీపీ నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రైతుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు. అన్నదాతల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం అవహేళన చేస్తోందని మండిపడ్డారు. వేదిక ఏదైనా అమరావతి నినాదమే మారుమోగుతోంది. మేము సైతం అంటూ రాజధాని రైతులకు మద్దతు తెలుపుతున్నారు. విజయవాడ కానూరులోని ఓ శుభకార్యంలో అమరావతి ఫ్లకార్డులు ప్రదర్శించారు. జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. 3 రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. జేఏసీ ఆధ్వర్యంల్లో జిల్లాల్లో ఆందోళనలు హోరెత్తిస్తున్నారు.. అటు పలు జిల్లాల నుంచి రైతులు అమరావతికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com