ఏపీలో ప్రధాన పార్టీల మధ్య రాజుకుంటున్న స్థానిక ఎన్నికల వేడి

ఏపీలో ప్రధాన పార్టీల మధ్య రాజుకుంటున్న స్థానిక ఎన్నికల వేడి

స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా కసరత్తు ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. ఏకకాలంలో నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల కమిషనర్ ముందుంచింది అధికారుల బృందం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈనెల 21న MPTC, ZPTC ఎన్నికలు, 24న పురపాలక సంఘాలు, 27న గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు నిర్వహించాలన్న ప్రతిపాదనపై ఎన్నికల కమిషనర్‌తో చర్చించారు అధికారులు. రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు మార్చి నెలాఖరులోగా రావాలంటే.. ఈ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. అంతేకాదు..వీలైనంత త్వరగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి వివరాలు అందజేస్తామని ఉన్నతాధికారుల బృందం కమిషనర్‌కు తెలిపింది.

అయితే..రిజర్వేషన్లపై ఎటూ తేలకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ తీరుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు..బీసీలకు అన్యాయం జరిగే ఏ కార్యక్రమాన్నైనా సహించేది లేదన్నారు. తెలుగుదేశం అంటే బీసీలు .. బీసీలంటే తెలుగుదేశం అని అన్నారు. అందుకే సీఎం జగన్ బీసీలపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24శాతానికి తగ్గించడం ఉన్మాద చర్యగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ల కోత బీసీలు 16 వేల పదవులు కోల్పోతారని అన్నారు చంద్రబాబు. ప్రభుత్వం తీరుకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అటు న్యాయపోరాటం, ఇటు ప్రజా పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. జీవో 558 ద్వారా జగన్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని మండిపడ్డారు చంద్రబాబు. బీసీల గొంతు నొక్కేందుకే శాసన మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు . సబ్ ప్లాన్ నిధులను మళ్లించడం, అసైన్డ్ భూములు లాక్కోవడంతోపాటు కార్పొరేషన్లనూ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ..సుప్రీం కోర్టును ఆశ్రయించారు టీడీపీ నేతలు. బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం సీఎం జగన్ కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు.

వైసీపీ నేతలు ఇప్పటి నుంచే ప్రజలను ప్రలోభ పెడుతున్నారని టీడీపీ ఆరోపించింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగులు వేశారని... అటు వాలంటీర్లు అధికార పార్టీకే ఓట్లు వేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్ జె. నివాస్‌ను కలిశారు. బలహీనవర్గాలకు తీరని అన్యాయం చేసిన జగన్ బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదన్న దురుద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

Tags

Next Story