ఆంధ్రప్రదేశ్

అమరావతిపై బీజేపీలో భిన్న స్వరాలు.. రైతుల్లో బీజేపీపై ఆగ్రహ జ్వాలలు

అమరావతిపై బీజేపీలో భిన్న స్వరాలు.. రైతుల్లో బీజేపీపై ఆగ్రహ జ్వాలలు
X

రాజధాని అమరావతిపై బీజేపీ నేతల భిన్నస్వరాలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిగ్గా మారాయి. అమరావతి అంగుళం కూడా కదలని.. రాజధాని తరలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని ఒకరంటే.. అదే పార్టీలోని మరో నేత మాత్రం ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని.. రాజధాని తరలింపు అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంటూ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అమరావతిపై బీజేపీ చెలగాటమాడుతుందా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. రాజధాని తరలింపుపై బీజేపీ అసలు స్టాండ్‌ ఏంటనేది ఎవరికి అంతుపట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందనే ఆశ అమరావతి రైతుల్లో ఉంది. తమకు అనుకూల ప్రకటన వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ నేతల భిన్న స్వరాలు రాజధాని రైతులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

రాజధాని తరలింపును ఏపీ బీజేపీ ముందు నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. పరిపాలన వికేంద్రీకరణకు తాము వ్యతిరేకం అని.. అభివృద్ధి వికేంద్రీకరణకు మాత్రమే సానూకూలమంటూ చెబుతూ వస్తోంది. అంతే కాదు రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ కూడా రాజకీయ తీర్మానం కూడా చేసింది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అమరావతికి అనుకూలంగా గళం విప్పుతున్నారు. రాజధాని తరలించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెగేసి చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని వీలు దొరికినప్పుడల్లా ఎండగడుతున్నారు. కానీ అదే పార్టీ ఎంపీ జీవీఎల్‌ వ్యాఖ్యలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

అటు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా అమరావతి అంగులం కూడా కదలదని గతంలో స్పష్టం చేశారు. ఎలా కదిలిస్తారో చూస్తామన్నారు. పార్టీ సిద్ధాంతాలు ఏవైనా ప్రజలకు నష్టం జరిగేతే చూస్తూ ఊరుకోబోమన్నారాయన. తాజాగా ప్రెస్‌మీట్‌ పెట్టిన సుజనా చౌదరి.. మరోసారి అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు. ఏపీ రాజధాని అమరావతిని తరలిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు. రాజధాని కోసం ఇప్పటికే ఎంతో చేశామన్నారు. రాజకీయంగా తీర్మానం కూడా చేశామని చెప్పారు.

ఇదిలా ఉంటే.. సుజనా చౌదరి ప్రెస్‌ మీట్‌ పెట్టిన రెండు గంటల తరువాత బీజేపీ ఎంపీ జీవీఎల్‌ కూడా మీడియా సమావేశం పెట్టి మరోసారి రాజధాని తరలింపులో కేంద్రం జోక్యం చేసుకోబోదంటూ వ్యాఖ్యలు చేయడం బీజేపీలో అగ్గి రాజేస్తోంది. అమరావతే రాజధానిగా రాజకీయంగా తీర్మానం చేశామని.. అంతమాత్రాన చట్టాలను మార్చి రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరడం సరికాదని అన్నారు. రాజధానిపై కేంద్రం ఎవరైనా జోక్యం చేసుకుంటుందని చెప్పినా.. అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తేల్చి చెప్పారు జీవీఎల్‌.

ఒకే పార్టీలోని ఇద్దరి నేతల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలంటూ తీర్మానం చేసిన బీజేపీ నేతలు.. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ చేసిన తీర్మానాన్ని కేంద్రం ఎందుకు పాటించదని అంటున్నారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా అమరావతి విషయంలో ఒకటి నుంచి ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని ప్రకటించింది. బీజేపీతో కలిసి పోరాడతామని స్పష్టం చేసింది. పవన్‌ ప్రస్తుతం వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటు బీజేపీ కూడా అమరావతిపై పోరాటం చేస్తామని కన్నాతో పాటు పార్టీ నేతలంతా చెబుతున్నా.. ఇందుకు విరుద్ధంగా జీవీఎల్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలనే కన్ఫ్యూజ్‌ చేస్తున్నాయి.

Next Story

RELATED STORIES