ఢిల్లీ అల్లర్లకు సంబంధించి సంచలన విషయాలు

ఢిల్లీ అల్లర్లకు సంబంధించి సంచలన విషయాలు

ఢిల్లీ అల్లర్లకు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అల్లరిమూకలు ఎలా రెచ్చిపోయాయో వీడియోల సాక్షిగా బయటపడుతోంది. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ముసుగులో ఓ వర్గం వ్యక్తులు ఎలా చెలరేగిపోయారో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులను చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో ఆలస్యంగా బయటికొచ్చింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫిబ్రవరి చివరి వారంలో ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. అసాంఘిక శక్తులు హింసాత్మక ఘటనలకు తెగబడ్డాయి. ఆ అల్లర్లను నివారించడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ పని చేశారు. ఐతే, ఆ ప్రయత్నమే వారి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 24న చాంద్‌బాగ్‌లో ఘర్షణలు జరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆందోళనకారులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ, అల్లరిమూకలు ససేమిరా వినలేదు. పైగా పోలీసులపై క్రూరంగా దాడి చేశారు. రాళ్లు విసురుతూ, కర్రలతో కొడుతూ పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశా రు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు ఢిల్లీలో ఆందోళన చేప్టటారు. షాహిన్‌బాగ్, చాంద్‌బాగ్, జఫ్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధించి ధర్నా చేశారు. రహదారులను దిగ్బంధించడంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఐనప్పటికీ ముస్లింలు ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో జఫ్రాబాద్, చాంద్‌బాగ్‌ తదితర ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. చాంద్‌బాగ్‌లో అల్లర్లను ఆపడానికి పోలీసులు వెళ్లారు. పోలీసులను చూడగానే అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రెండువైపుల నుంచి వారిని చుట్టుముట్టి రాళ్లతో దాడి చేశారు. దాంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అప్పుడు ఆందోళనకారులు కొద్దిగా వెనక్కి తగ్గారు. కానీ కాసేపటికే మళ్లీ తెగబడ్డారు. ఈసారి పోలీసులను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. ఖాకీలను రౌండప్ చేసి రాళ్లతో కొట్టారు. కర్రలతో చితకబాదారు.

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకుల దాడిలో హెడ్ కానిస్టేబుల్ రతన్‌లాల్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. డీసీపీ అమిత్ శర్మ, గోకుల్‌పురి ఏసీపీ అనూజ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, చాంద్‌బాగ్‌ ఏరియాలోనే ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యాడు. అంకిత్ శర్మను కూడా అల్లరిమూకలే హత్య చేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను లొంగిపోవడానికి కోర్టు అంగీకరించలేదు. దాంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ హత్యకు తాహిర్ హుస్సేన్ కారణమని ఆరోపణలున్నాయి. అలాగే అతని ఇంట్లో పెద్ద ఎత్తున మారణాయుధాలు, విధ్వంసకర వస్తువులు దొరికాయి. ఇతనితో పాటు మరో ఆప్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడి ఇంట్లోనూ విధ్వంసకర వస్తువులు దొరికాయి. వారిపై కూడా విచారణ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story