తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కొత్త మున్సిపల్ చట్టం తరహాలో మరో చట్టం

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కొత్త మున్సిపల్ చట్టం తరహాలో మరో చట్టం

శుక్రవారం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తమిళి సై సౌందర రాజన్ గవర్నర్ గా భాద్యతలు స్వీకరించాక జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు ఇవి. సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఇక సభలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బడ్జెట్ రూపొందించటంలో పలు సూచనలు చేసిన సీఎం.. వాస్తవికత అద్దం పట్టేలా కేటాయింపులు ఉండాలన్నారు. 2020-2021 బడ్జెట్ దాదాపు లక్ష 60 వేల కోట్ల రూపాయల వరకు ఉండబోతున్నట్లు సమాచారం. గత ఏడాది బడ్జెట్ కంటే 13 శాతం ఎక్కువగా అంచనాలు రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ లోటును భర్తీ చేసుకునేందుకు ఈ సారి బడ్జెట్లో భూముల అమ్మకాల గురించి చర్చించే అవకాశం కూడా ఉంది. ఈ సారి బడ్జెట్ లో వివిధ సంక్షేమ పథకాలతో పాటు, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకోసం నిధులు భారీగా కేటాయించే అవకాశం ఉంది. ఇక రైతుబంధు స్కీమ్ పై కూడా అసెంబ్లీలో లో మరోసారి చర్చ జరగనుంది. పది ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు స్కీమ్ వర్తింపజేయాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయనున్నారు. అలాగే కొత్త రెవెన్యూ చట్టం కోసం బిల్లు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే కొత్త మున్సిపల్ చట్టం తరహాలోనే కొత్త GHMC చట్టం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సమావేశాల్లోనే గల్ఫ్ లో ఉన్న ప్రవాస తెలంగాణ వాళ్ళ కోసం ఎన్నారై పాలసీ ప్రకటించే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం కమిటీ వేసినా ఒక పరిష్కారం చూపలేదు. బడ్జెట్ సమావేశాల్లో సీఎం నుంచి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనాలున్నాయి.

దాదాపు 15 రోజులపాటు సాగనున్న ఈ సమావేశాలు సంక్షేమం, అభివృద్ధిలే ప్రధాన లక్ష్యంగా సాగనున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాబట్టీ ఉద్యోగులు, నిరుద్యోగులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ సమావేశాలకోసం ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story