81వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
అమరావతి ఉద్యమం 81వ రోజుకు చేరింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వేలాది మంది ఇన్ని రోజులుగా దీక్షలు, ఆందోళనలు చేపడుతున్నా కూడా సర్కారు పట్టించుకోవడం లేదు. అయినా రైతులు వెనకడుగు వేయడం లేదు. 29 గ్రామాల్లోనూ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు.. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు.. వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగించారు..పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులోని శిబిరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి.
అమరావతి కోసం రోజుకో రూపంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు మహిళా రైతులు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పూజలు చేసి అక్కడి నుంచి విజయవాడ దుర్గగుడి వరకు పాదయాత్ర నిర్వహించారు.
మహిళల పాదయాత్రను వెంకటపాలెం మంతెన ఆశ్రమం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.హైకోర్టు న్యాయమూర్తులు వెళ్లేవరకు ఆగాలని సూచించారు. దీంతో అక్కడే ఉండిపోయిన మహిళలు.. హైకోర్టుకు వెళ్తున్న జడ్జిలకు చేతులు జోడించి నమస్కరించారు. పొంగల్లు, పూజా సామాగ్రితో రోడ్డుపై కూర్చొని అభివాదం చేశారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు చేశారు మహిళలు. అమ్మవారికి మొక్కులు చెల్లించారు. వెలగపూడి శిబిరంలో ప్రత్యేక పూజు నిర్వహించారు మహిళలు..విష్ణుసహస్రనామం పాటించారు. సీఎం జగన్ మనసు మార్చాలంటూ వేడుకున్నారు.
మంగళగిరి మెడికల్ అండ్ కల్చర్ అసోసియేషన్ సభ్యులు రైతుల దీక్షకు మద్దతు తెలిపారు. అమరావతి కోసం మేము సైతం అంటూ సంఘీభావం ప్రకటించారు. రాజధాని రైతుల నిరసనలకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రతిరోజూ 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నేతలు, సామాన్యులు కూడా అమరావతికి మద్దతు తెలుపుతున్నారు. ఇది కేవలం 29 గ్రామాల సమస్య కాదని.. ఐదు కోట్ల ఆంధ్రుల సమస్యని భరోసా ఇస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com