తెలుగురాష్ట్రాల్లో 'కరోనా' అనుమానం తప్ప వ్యాప్తి లేదు..

తెలుగురాష్ట్రాల్లో కరోనా అనుమానం తప్ప వ్యాప్తి లేదు..

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులేవీ నమోదు కాలేదు. మైండ్ స్పేస్‌ లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అపోలో పారిశుద్ధ్య కార్మికురాలికి కరోనా లేదని ఇప్పటికే తేలిపోయింది. మరోవైపు, హైదరాబాద్ లో ఏకైక కరోనా బాధితుడు గాంధీ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అయితే, కొత్త కేసులేవీ నమోదు కాకపోయినా.. అనుమానితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.

జగిత్యాల జల్లాలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. గోపాల్‌ రావుపేటకు చెందిన శ్రీహరి గత నెల 29న దుబాయ్‌ నుండి హైదరాబాద్ వచ్చారు. స్నేహితుల రూమ్‌లో ఒక రోజు ఉన్న తర్వాత.. బస్‌లో గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో శ్రీహరి బస చేసిన రూమ్‌లోని అతడి స్నేహితుల వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.

విదేశీ ప్రయాణికులతోనే తెలంగాణ‌లో క‌రోణ భ‌యం పెరిగింది. దీంతో ఎయిర్ పోర్ట్ నుండి వ‌చ్చే ప్రయాణికుల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేసిన త‌రువాతే బ‌య‌ట‌కు పంపుతున్నారు అధికారులు. ఇక ఎయిర్ పోర్ట్ కు వ‌చ్చి పోయే ఆర్టీసీ స‌ర్వీసుల్లో సైతం ప్రత్యేక చ‌ర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్ పోర్ట్ కు ప్రయాణికుల‌ను చేర‌వేసే ఎల‌క్ట్రీక్ స‌ర్వీసుల్లో క్లీనింగ్ ప్రక్రియ ముమ్మరం చేసారు ఆర్టీసీ అధికారులు.

ఇదిలావుంటే, కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అభినందించారు. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని.. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరించాలని అన్నారు. కరోనా వైరస్‌పై కేంద్ర మంత్రి హర్షవర్దన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తెలంగాణలో కరోనా ప్రభావం అంతగా లేదని.. దీనిపై ఎలాంటి వదంతులు నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కేసులను సమర్థంగా అదుపు చేయడంపై కేరళకు వైద్య బృందాన్ని పంపామన్నారు. వైరస్‌ వ్యాప్తి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటున్నారు.

కరోనా వైరస్ ప్రభావం ఏపీలోనూ కనిపిస్తోంది. శుక్రవారం విశాఖ తీరంలో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. చైనాకు చెందిన 'ఫార్చూన్‌ హీరో' షిప్‌ తీరానికి సమీపంలోకి రావడంతో పోర్ట్‌కి రావడానికి అధికారులు అనుమతి నిరాకరించారు. పారాదీప్ పోర్టు అనుమతి నిరాకరించడంతో విశాఖకు వచ్చిన ఈ షిప్‌లో 22 మంది నావికులు ఉన్నారు. వీరికి కరోనా సోకిందన్న అనుమానంతో ఒడ్డుకు రావొద్దని ఆంక్షలు విధించారు. నావికులందరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఈ షిప్‌ను వెనక్కు తిప్పి పంపాలనే పోర్ట్ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.

విశాఖ నగరంలోనూ కరోనా వైరస్‌ ఆందోళనలకు గురిచేస్తోంది. వైరస్‌ భయంతో.. ప్రజలు, పర్యాటకులు బయట తిరగలాంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అయితే, వైరస్‌పై మరీ భయపడాల్సిన అవసరంలేదని.. జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయినప్పటికీ... కరోనా ప్రభావంతో నిత్యం జనంతో కిటకిటలాడే పర్యాటక కేంద్రాలు, సినిమా థియేటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. రోడ్లపై తినుబండారాల షాపులు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్, ధియేటర్లలో జనం మాస్క్ ల ధరించి కనిపిస్తున్నారు. తిరుపతి ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి ప్రతిరోజు 50 వేలకు మందికి పైగా భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాలకు చెందిన వేలాదిమంది నగరానికి వస్తుండటంతో టీటీడీ అధికారులతోపాటు వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తయ్యారు.

ఇదిలావుంటే, ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి ప్రత్యక్షంగా దోహదం చేస్తోంది. పది రోజుల క్రితం ఇటలీ నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు వచ్చిన యువతి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. దీంతో.. ఆమె తండ్రి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తన కూతుర్ని ఐసోలేటెడ్‌ వార్డులో చేర్చుకోమని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బ్రతిమాలాడు. అయితే.. ఇక్కడ ఐసోలేటెడ్‌ సౌకర్యం లేదని విజయవాడలో మాత్రమే ఉందని ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. కనీసం పేషెంట్‌ దగ్గర నుంచి ఎలాంటి వివరాలు సేకరించ లేదు. దీంతో.. ఆ యువతి ఆస్పత్రిలో కాసేపు కూర్చుని వెళ్లిపోయింది. ఈ ఘటన కరోనా పట్ల ఏపీ సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story