కరోనా పాజిటివ్‌ రోగితో స్వయంగా మాట్లాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల

కరోనా పాజిటివ్‌ రోగితో స్వయంగా మాట్లాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల

తెలంగాణలో కరోనా వైరస్‌పై నెలకొన్ని భయాన్ని తొలగించేందుకు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. గాంధీ ఆస్పత్రిలోని కరోనా స్పెషల్‌ వార్డును సందర్శించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన్ను బయటకు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి గురించి అనవసర భయాలు, పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో భరోసా కల్పించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈటెల తెలిపారు. కరోనాను అదుపు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది 24 గంటలు కష్టపడుతున్నారని.. దీనికి మీడియా కూడా చక్కటి సహకారం అందిస్తోందని మంత్రి ప్రశంసించారు.

జూనియర్‌ డాక్టర్లతో సైతం మాట్లాడిన ఈటెల.. వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన మీరే అనవసరంగా భయాందోళనలకు గురికావడం సరైనది కాదని సూచించారు. కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళితేనే వైరస్‌ వాపిస్తుంది తప్ప.. స్పెషల్‌ వార్డు ఉండడం వల్ల మిగతా వారికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. స్పెషల్‌ వార్డు వైపు మిగతా వారు వెళ్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రతి రెండు గంటలకోసారి ఆల్కహాల్‌ బేస్డ్‌ క్లీనర్లతో లిఫ్టులు, వార్డులను శుభ్రం చేయాలని ఆదేశించారు. వివిధ వార్డుల్లో ఉన్న పేషెంట్లను పలకరించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పరిస్థితి అంతా అదుపులోనే ఉందని.. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మంత్రి ఈటెల భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story