9 రోజులు బడ్జెట్ సమావేశాలు

9 రోజులు బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. తమిళిసై తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే తొలిస్థానంలో నిలవడం గర్వకారణమని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పెన్షన్, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, పేదలకు ఉపాధి కల్పన, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మీ, రైతుబంధు లాంటి పథకాలు దేశానికే ఆదర్శనీయమని కొనియాడారు. ఆర్థికమాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ ప్రభుత్వం క్రమశిక్షణ పాటించందని చెప్పారు. గవర్నర్ చేసిన ప్రసంగంపై శనివారం ధన్యవాద తీర్మానం ఉంటుంది. చర్చ తర్వాత ఆ ప్రసంగాన్ని ఆమోదించనున్నారు.

సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. 12 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 8వ తేదీన ఉభయసభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 20 వరకు జరగనున్న సమావేశాల్లో 9,10,15 తేదీల్లో సెలవులుంటాయని బీఏసీ తెలిపింది. ఈ నెల 20న ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలపనున్నాయి. ఒకవేళ సమావేశాలు పొడిగించాల్సివస్తే ఈనెల 20న బీఏసీ మరోసారి సమావేశం అవుతుంది. ఎన్ని రోజులు పొడిగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. శనివారం సాయంత్రం జరగనున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. మండలి సమావేశాలు 8 రోజుల పాటు జరుగనున్నాయి.

బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోద ముద్ర వేయడంతోపాటు.. కేంద్రం తీసుకొచ్చిన CAA, NPR , ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నారు. ఇక బడ్జెట్‌ కోసం మధ్యతరగతి ప్రజలు, రైతులు, ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ కొత్తగా ఏమైనా వరాలు కురిపిస్తారా.. లేక మాంధ్యం ప్రభావంతో ఆచితూచి అడుగులు వేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story