ఆందోళనలో యస్ బ్యాంక్ ఖాతాదారులు.. బ్రాంచ్‌ల ముందు క్యూలు

సంక్షోభంలో చిక్కుకున్న యెస్ బ్యాంక్ ఖాతాదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రాంచ్‌లు తెరిచే సమయానికి చాలా మంది ఖాతాదారులు దేశవ్యాప్తంగా క్యూ కట్టారు. డిపాజిట్ దారులు 50 వేలు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలులేక పోవడంతో ఖాతాదారుల్లో టెన్షన్ నెలకొంది. అకౌంట్ హోల్డర్ల సొమ్ముకు హామీ ఇస్తున్నట్టు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినప్పటికీ.. పలు బ్రాంచ్‌ల వద్ద జనం క్యూ కట్టారు. దేశరాజధాని ఢిల్లీలో అలాంటి దృశ్యాలు యెస్ బ్రాంచ్‌ల వద్ద్ కనిపిస్తున్నాయి.
విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలతో యెస్ బ్యాంక్ ఖాతాదారులు బ్రాంచ్‌ల వద్ద బారులు తీరుతున్నారు. వార్త తెలిసినప్పటి నుంచి ATMలు, పలు శాఖల్లో కస్టమర్లు క్యూ కట్టారు. తమ డిపాజిట్ల పరిస్థితి ఏమిటని బ్యాంక్ అధికారులతో ఎంక్వైరీ చేస్తున్నారు. కొన్ని చోట్ల ATMలలో డబ్బు లేకపోవడం తదితర ఫిర్యాదులతో బ్యాంక్ హెల్ప్‌లైన్ హోరెత్తింది.
యెస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం విధించిన వేళ.. బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆయనతోపాటు మరికొంతమంది యెస్ బ్యాంక్ అధికారులపై అక్రమ నగదు చలామణి ఆరోపణలున్నాయి. DHFLకు బ్యాంక్ ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి. ఇందులో రానా కపూర్ పాత్ర ఉందన్న అనుమానాలున్నాయి. దీనిపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. DHFLకు రుణాలు ఇచ్చినందుకు ప్రతిఫలంగా.. వారి నుంచి కొంత సొమ్మును రానా పొందారన్న కోణంలో విచారణ జరుగుతోంది. రానా భార్య ఖాతాలోకి డబ్బు చేరినట్టు ఆధారాలు కూడా ఉన్నట్టు సమాచారం.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంకును గట్టెక్కించడానికి.. కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగాయి. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపై పడకుండా ఆర్బీఐ అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే యెస్ బ్యాంకు బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ.. ఓ కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. బ్యాంకుపై మారటోరియం విధించిన 24 గంటల తర్వాత రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్ ప్రకటించింది. SBI మాజీ CFO ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. అటు యెస్ బ్యాంకుకు ఇద్దరు నామినీ డైరెక్టర్లను నియమించనుంది SBI.
రీకన్‌స్ట్రక్షన్ చేసిన బ్యాంకులో హక్కులు, బాధ్యతల్లో ఎలాంటి మార్పులు ఉండవు. యెస్ బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు, నియమ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. కీలక బాధ్యతల్లో ఉన్న మేనేజర్లను బోర్డు తొలగించే అవకాశం ఉంది. బ్యాంక్ బ్రాంచిల్లో, కార్యాలయాల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవు. రీకన్‌స్ట్రక్షన్ చేసిన బ్యాంకు కొత్త ఆఫీసుల్ని, బ్రాంచుల్ని తెరిచే అవకాశం ఉంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com