కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం
X

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ వాడివేడిగా సాగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్‌ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక ఒక ప్రాంతానికా? అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ పాలమూరుపై ఎందుకు లేదని నిలదీశారు.

రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రజల్లో తిరుగుతున్నారో.. రోడ్లపై తిరుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జిల్లాలకు వెళితే కోమటిరెడ్డిని పరిగెత్తిస్తారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. వెంటనే రాజగోపాల్ రెడ్డి కల్పించుకుని.. తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి నెత్తినపెట్టుకుంటే ఇలాగే ఉంటుంటూ కౌంటర్‌ ఇచ్చారు. పరస్పర ఆరోపణలతో సభలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

పౌరసత్వ సవరణ చట్టంపై శాసన సభలో కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. సీఏఏపై చర్చ జరగాలన్నారు. సీఏఏపై తాము ఇప్పటికే పార్లమెంట్‌లో వ్యతిరేకించామని చెప్పిన కేసీఆర్‌.. దేశ వ్యాప్తంగా ఐదారు అసెంబ్లీల్లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని గుర్తు చేశారు.

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెబుతున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో ప్రతిపక్ష సభ్యులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు అరవడం సరికాదని.. సభకు ఆటంకం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సూచించారాయన. దీంతో ఆరుగురు ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్‌ చేశారు స్పీకర్‌ పోచారం. సస్పెండైన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి, వీరయ్య ఉన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ ఆదివారానికి వాయిదా వేశారు స్పీకర్‌.

Tags

Next Story