కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది.. ప్రస్తుతం 97 దేశాల్లో..

కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది.. ప్రస్తుతం 97 దేశాల్లో..

కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. గతేడాది డిసెంబరులో చైనాలో వెలుగుచూసిన ఈ మహమ్మారి ప్రస్తుతం 97 దేశాల్లో..లక్ష మందికిపైగా సోకింది. వీరిలో చైనీయులే 80 వేల మందికిపైగా ఉన్నారు. కొవిడ్‌-19 కారణంగా చైనాలో మరో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. 99 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 3వేల70కి పెరిగింది. అయితే గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య తొలిసారిగా వందలోపు నమోదవడం కాస్తంత ఊరట కలిగించే విషయం.

చైనాలో కరోనా అనుమానితులను ఉంచిన ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సుమారు 70 మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు.చైనాలోని ప్యూజిన్‌ ఫ్రావిన్స్‌లో ఉన్న క్వాన్‌జౌ నగరంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 80 గదులున్న ఓ రెండంతస్తుల హోటల్‌ భవనం ఒక్కసారిగా కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 30 మందిని కాపాడారు. మరికొందరు ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు తెలుస్తోంది..

చైనాలో కాస్త తగ్గుముఖం పడుతున్నా మిగతా దేశాల్లో కరోనా వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటలీ, ఇరాన్‌ అల్లాడిపోతున్నాయి. చైనా తర్వాత ఈ రెండు దేశాల్లోనే అతిఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.. ఇరాన్‌లో శనివారం ఒక్కరోజే 21 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో మరణించినవారి సంఖ్య 145కు చేరింది. అటుయూరోపియన్ దేశాలు కూడా కరోనా గుప్పిట్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, జర్మనీలలో వైరస్ ప్రభావం ఎక్కు వగా ఉంది. ప్రతి దేశంలో కనీసం 100 కేసులు నమోదవుతున్నాయి.

భారత్‌లో మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ భారత్‌లో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 34కి చేరింది. కొత్తగా వైరస్‌ సోకిన బాధితుల్లో ఇరాన్‌కు వెళ్లివచ్చిన ఇద్దరు లద్ధాఖ్‌ వాసులు, ఒమన్‌కు వెళ్లివచ్చిన తమిళనాడు వాసి ఉన్నారు. శనివారం ఇరాన్‌ నుంచి 108 మంది భారతీయులకు చెందిన నమూనాలు వచ్చాయి. వీటిని ఎయిమ్స్‌ ప్రయోగశాలలో పరీక్షిస్తున్నారు. అటు వైరస్‌పై

ప్రజల్లో అవగాహన పెంచడానికి అన్ని టెలికాం సంస్థలు మొబైల్‌ ఫోన్‌ కాలర్‌ ట్యూన్‌ని ప్రారంభించాయి. దాని ద్వారా ప్రాథమిక ముందస్తు నివారణ చర్యల గురించి ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణలో కొత్తగా ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు..అయితే కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన 104 హెల్ప్‌లైన్‌కు విపరీతంగా కాల్స్‌ వస్తున్నాయి. ఏర్పాటైన 24 గంటల్లోనే 210 కాల్స్‌ వచ్చాయి. అందులో 185 మంది కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మరో 25 మంది తమకు కరోనా లక్షణాలున్నాయని 104 హెల్ప్‌లైన్‌కు తెలిపారు. అయితే ఆ లక్షణాలున్నాయని చెప్పిన వారిని క్రాస్‌ చెక్‌ చేయగా ఎలాంటి లక్షణాలు లేవని తేలింది.అటు హైదరాబాద్‌ నగరంలో 40 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story