'కరోనా' భయంతో గజగజ వణుకుతున్న ప్రపంచ దేశాలు

కరోనా భయంతో గజగజ వణుకుతున్న ప్రపంచ దేశాలు

కరోనా పేరువింటేనే ఇప్పుడు ప్రపంచ దేశాలు గజగజ వణుకుతున్నాయి. ఈ వైరస్ కు సరైన ట్రీట్ మెంట్ అందుబాటులో లేకపోవడంతో అన్నిదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అగ్రదేశం అమెరికాలోను కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. వైరస్ వ్యాప్తికి ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి కట్టడి కావడంలేదు. కరోనా వైరస్ తో ఇప్పటివరకు అమెరికాలో 14 మంది మరణించారు. వ్యాధి బారిన వారి సంఖ్య 299కి చేరింది. ఒక్కరోజులోనే వంద మందికి వైరస్ సోకడంలో అధికారులు కలవరపాటుకు గురవుతున్నారు.

దేశంలోని కరోనా వైరస్ ను అరికట్టేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా వేలాది మందితో సాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకున్న ఓడలో ప్రయాణీకులకు వైరస్ అటాక్ అయింది. ఓడలోని 21మందికి వైరస్ సోకినట్లు ఉపాధ్యక్షుడు మిక్ పెన్స్ వైట్ హౌజ్ లో వెల్లడించారు. ఈ ఓడలో మొత్తం 3వేల 5వందల మంది ఉన్నారు. ఓడలోని వారందరిని పరీక్షించగా... 21మందికి పాజిటీవ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన వారిని కొద్దిరోజులపాటు అబ్జర్వేషన్ లో ఉంచనున్నట్లు వెల్లడించారు.

దేశంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు వైస్ ప్రెసిడెంట్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ప్రతిరోజు ఉన్నత స్థాయి అధికారులతో వైట్ హౌజ్ లో సమావేశమవుతున్నారు. దేశంలోని పరిస్థితిని ప్రతిరోజు మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు వెల్లడిస్తున్నారు. అమెరికా ప్రజల ఆరోగ్యం, భద్రత కంటే ఏది ముఖ్యం కాదని ప్రెసిడెంట్ ఉన్నత స్థాయి అధికారులు, ఏజెన్సీల సమావేశంలో అన్నట్లు ఉపాధ్యక్షుడు మిక్ పెన్స్ వివరించారు.

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు చేపట్టింది అమెరికా ప్రభుత్వం. 8.3 బిలియన్ల ఎమర్జెన్సీ ఫండ్ ను ట్రంప్ విడుదల చేశారు. ప్రజారోగ్యంలో భాగమైన మెడిసన్, చికిత్సకు ఈ నిధిని వినియోగించనున్నారు. అట్లాంటాలోని వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాన్ని సందర్శించిన ప్రెసిడెంట్ ట్రంప్, వైరస్ బారిన పడిన వారికి అందుతున్న చికిత్సను పరిశీలించారు. అయితే వైరస్ చాపకింద నీరులా దేశంలోని దాదాపు 25 రాష్ట్రాలకు వ్యాపించింది. దీంతో దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం అత్యవసర నిధులను విడుదల చేసింది. వీటిని రాష్ట్రాలకు అందించనుంది.

అమెరికాలోని చాలా ప్రాంతాల్లో జనం మాస్కులు లేకుండా బయటకు రావడంలేదు. ఏమాత్రం అనుమానం వచ్చినా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని వైరస్ కంట్రోల్ అవుతుందని అమెరికన్ హెల్త్ అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెపుతూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వైరస్ ప్రభావం అమెరికన్ ఆర్ధిక, వ్యాపార, పర్యాటక రంగంపై భారీగానే పడింది. ఆంక్షల కారణంగా పర్యాటకులతోపాటు ఎగుమతులు, దిగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story