అసెంబ్లీలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమ పరిణామాలను వివరించారు. ఉద్యమాన్ని నీరుగార్చడానికి కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్, బీజేపీ కుట్రలు ఆగలేదన్నారు. అందుకే ఆ పార్టీలకు ప్రజలు వాతపెట్టారని చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారని అన్నారు కేసీఆర్.
మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అన్నారు కేసీఆర్. ఇలాంటి స్కీమ్‌పై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేసిందని ఫైరయ్యారు. ఆ పథకం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు వినే దమ్ములేదని.. అందుకే సభ నుంచి పారిపోయారని విమర్శించారు.
CAA, NRCపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందన్నారు సీఎం కేసీఆర్. దీనిపై రోజంతా ప్రత్యేకంగా చర్చించి.. వందకు వంద శాతం తీర్మానం పెడతామని స్పష్టం చేశారు. తనకే బర్త్ సర్ట్‌ఫికేట్ లేదని.. ఇక దళితులు, పేదలకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇక, కరోనా వైరస్ గురించి హైరానా పడాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టైనా సరే ఆ వైరస్‌ను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
వచ్చే బడ్జెట్‌లో స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతామన్నారు సీఎం కేసీఆర్. గత ఆరేళ్లలో ఒకేసారి మాత్రమే ఛార్జీలు పెంచామని గుర్తుచేశారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని.. ఎక్కడా ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం లేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ప్రసంగం తర్వాత సీఎం కేసీఆర్ శాసన మండలికి వెళ్లారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com