భారత్‌లో తాజాగా మరో ముగ్గురు కోవిడ్-19

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. భారత్‌లో తాజాగా మరో ముగ్గురు కోవిడ్-19 బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో ఇద్దరు లడాఖ్‌కు చెందిన వారు కాగా.. ఇటీవలే ఇరాన్‌కు వెళ్లారని, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒమన్‌ను సందర్శించారని వివరించారు. దీంతో భారత్‌లో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 34కు చేరుకున్నట్లు అయింది. ఇందులో 16 మంది ఇటలీ పర్యాటకులే ఉన్నారు. తాజాగా కోవిడ్ బారిన పడ్డ ఈ ముగ్గురి ఆరోగ్యం నిలకడగానే ఉంది. భూటాన్‌లో కరోనా వైరస్ సోకిన ఇద్దరు అమెరికన్లతో దగ్గరి సంబంధాలు నెరపిన 150 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు.
కరోనా వైరస్ పరీక్షలు జరిపేందుకు దేశవ్యాప్తంగా 52 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రక్త నమూనాల సేకరణ విషయంలో సహకరించేందుకు మరో 57 పరిశోధనశాలలను గుర్తించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దేశంలో శుక్రవారం నాటికి మొత్తం 3404 మంది నుంచి సేకరించిన 4058 రక్త నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు. వూహాన్ నుంచి వచ్చిన భారతీయులు 654 మందికి సంబంధించిన 1308 నమూనాలు ఇందులో ఉన్నాయని అధికారులు వివరించారు.
జమ్మూకశ్మీర్‌లో కరోనా కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకిందనే ప్రచారం ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రానికి చెందిన ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వారి బ్లడ్ సాంపుల్స్ పరిశీలించగా హై వైరల్ లోడ్ అని వచ్చింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముుందు జాగ్రత్త చర్యగా వారిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇద్దరికి కరోనా సో కిందనే ప్రచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. రాష్ట్రంలో స్కూళ్లను మూసివేసి పిల్లలను ఇంటికి పంపించారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తి నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రసిద్ధి పొందిన పర్యాటక ప్రాంతాలు, చారిత్రక స్థలాలు, జనసమ్మర్థ ఏరియాలపై నిఘా పెట్టింది. ప్రఖ్యాత తాజ్ మహల్‌ను చూడడానికి వచ్చిన విదేశీ పర్యాటకులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 700 మందిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. మరో విదేశీ పర్యాటకుల్లో హై వైరల్ లోడ్ ఉందని డాక్టర్లు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా నియంత్రణకు చర్యలు పక్కాగా అమలవుతున్నాయి. ఎయిర్‌పోర్టులు, విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పర్‌ఫెక్ట్‌గా జరుగుతోంది. గౌహతి ఎయిర్‌పోర్టులో 585 మందిని స్క్రీ నింగ్ చేశారు. అందులో 112 మంది విదేశీయులు ఉన్నారు. ఇందులో ఒక ఇటాలియన్ టూరిస్టులో కరోనా లక్షణాలు కనిపించడంతో అతన్ని పరీక్షలకు పంపించారు.
ఇక, కేంద్ర ప్రభుత్వం కరోనా ప్రభావాన్ని నిశితంగా గమనిస్తోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ సలహాలు, సూచనలు అందచేస్తున్నారు. తాజాగా ఆయన, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో సమావేశమ్యయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య, వ్యాధి నివారణకు అమలు చేస్తున్న చర్యలను అడిగి తెలుసుకున్నా రు. కరోనా వైరస్ గురించి ప్రజలు భయపడాల్సిన పని లేదని మోదీ భరోసా ఇచ్చారు. ప్రపంచం మొత్తం నమస్తే అంటోందని, షేక్ హ్యాండ్‌లను పక్కకుపెట్టి నమస్కారానికే ప్రపంచ దేశాలు పెద్ద పీట వేస్తున్నాయని చెప్పారు.
కరోనా నివారణకు భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది. కరోనా బాధితులకు చికిత్స అందించడానికి 5 నగరాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com