ఈ నెల 12న బీజేపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

ఈ నెల 12న బీజేపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు బీజేపీ- జనసేన నేతలు ప్రకటించారు. విజయవాడలో ఇరు పార్టీల ముఖ్య నాయకులు సమావేశమై స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలి..? ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడారు. జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలో ఇరు పార్టీ మధ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు బీజేపీ నేత పురందేశ్వరి. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని.... తమ కూటమిని ప్రజలు ఆశ్వీరిదిస్తారన్నారు.

బీజేపీ - జనసేన పార్టీలు కలసి అన్ని స్థానాల్లో పోటీ చేస్తాయన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్‌. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. ప్రజలు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఓట్లు వేయాలని ఆయన కోరారు. ఉమ్మడి ప్రణాళికలతో ప్రజలకు మేలు జరిగేలా ముందుకెళ్తామన్నారు.

భవిష్యత్తులో తమ ఇరు పార్టీల మధ్య పొత్తు మరింత ధృడంగా, విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు ఇరుపార్టీ నేతలు. నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ఓ అవగాహనతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. భవిష్యత్తులో ఇరు పార్టీలు కలిసి ప్రజల తరఫున పోరాటాలు చేయడంతో పాటు ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్రానికి మేలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ఉమ్మడి సమావేశంలో బీజేపీ నుంచి జి.సతీష్, సోము వీర్రాజు, మాధవ్, కామినేని శ్రీనివాసరావు, శనక్కాయల అరుణ, ఆదినారాయణ రెడ్డి, జనసేన నుంచి శివశంకర్, కందుల దుర్గేష్, బోనబోయిన శ్రీనివాస్, పంతం నానాజీ ఇతర నేతలు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story