తెలంగాణ బడ్జెట్‌ 2020-21 ఎంతంటే..

తెలంగాణ బడ్జెట్‌ 2020-21 ఎంతంటే..

2020-21 ఆర్థిక ఏడాదికి తెలంగాణ బడ్జెట్‌.. లక్షా 82 వేల 914 కోట్ల 42 లక్షలుగా అసెంబ్లీలో ప్రతిపాదించారు మంత్రి హరీష్‌రావు. ఆర్థిక మంత్రి హోదాలో ఆయన తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని.. బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

రైతులు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం.. ఈ సారి బడ్జెట్‌లో మరింత ప్రాధాన్యం కల్పించింది. పెట్టుబడి సాయంగా రైతుల కోసం తెచ్చిన రైతుబంధు పథకానికి బడ్జెట్‌లో అదనంగా 2 వేల కోట్లు కేటాయించారు. మొత్తం 14 వేల కోట్లను కేటాయించారు‌. రైతు బీమా కోసం 1141 కోట్లను ప్రతిపాదించారు.

రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులకు బడ్జెట్‌లో తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. 25 వేల లోపు రుణాలున్న రైతులకు ఒకేసారి మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల్లోనే ఆ రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం 1198 కోట్లను విడుదల చేస్తుందని మంత్రి హరీష్‌ ప్రకటించారు.

సాగునీటి రంగానికి కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. 11 వేల 54 కోట్లను ప్రతిపాదించారు. రికార్డు సమయంలోనే కాళేశ్వరం పూర్తి చేసి రైతులకు నీరందిస్తున్నామని.. ఇదే స్ఫూర్తితో పాలమూరు ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని హరీష్‌ తెలిపారు

బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీల కోసం 1518 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 16 వేల 534 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం 9 వేల 771 కోట్లను ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది.

Tags

Read MoreRead Less
Next Story