లండన్ వెళ్ళిపోయేందుకు ప్రయత్నించిన రాణా కపూర్ కుమార్తెను నిలిపివేసిన అధికారులు

లండన్ వెళ్ళిపోయేందుకు ప్రయత్నించిన రాణా కపూర్ కుమార్తెను నిలిపివేసిన అధికారులు

పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన యస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో ఆ బ్యాంక్‌ వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌ నిర్వాకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో రుణాలు పొందిన కంపెనీల నుంచి ముడుపులు పొందేందుకు రాణా కపూర్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు 20 షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాణా కపూర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. కపూర్‌ అరెస్ట్‌తో ఆయన అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి.

రాణా కపూర్, డీహచ్ఎఫ్ఎల్, డూయిట్ అర్బన్ వెంచర్స్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరు మోసం, అవినీతి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. యెస్ బ్యాంకు నుంచి డీహెచ్ఎఫ్ఎల్ సంస్థకు ఆర్థిక సహకారం అందించి నేరంలో పాలుపంచుకున్నారని సీబీఐ తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థకు ఆర్థిక సహకారానికి బదులుగా కపూర్ తమ కుంటుంబ సభ్యులకు చెందిన డూయిట్ వెంచర్స్ కు ప్రయోజనం చేకూరేలా కుట్ర చేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్లు సమాచారం. గతంలో యూపీకి చెందిన పవర్ సెక్టార్ ఉద్యోగుల పీఎఫ్ నగదు వ్యవహారంలో ఇప్పటికే డీహెచ్ఎఫ్ఎల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.

అటు రాణా కపూర్ కుమార్తె రోషిణి కపూర్ లండన్ వెళ్ళిపోయేందుకు ప్రయత్నించగా, అధికారులు ఆమెను నిలిపేశారు. డోల్ట్ అర్బన్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రోషిణి కపూర్ డైరెక్టర్. ఈ కంపెనీ మనీలాండరింగ్ కేసులో ఈడీ నిఘాలో ఉంది. మరో వైపు రాణా కపూర్ అల్లుడు ఆదిత్యతో సహా ఆయన కుటుంబ సభ్యులందరిపైనా లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. యస్‌బ్యాంకును పునరుత్తేజితం చేసేందుకు ఆర్‌బీఐ ఇటీవల ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. బ్యాంక్ వినియోగదారులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story