ప్రభుత్వమే ఒప్పందాలను ఉల్లంఘిస్తే.. ప్రజా ప్రభుత్వం అంటారా: రైతులు
అమరావతి ఉద్యమం మంగళవారంతో 84 రోజుకు చేరింది. రాజధానిని కాపాడుకోవడం కోసం..29 గ్రామాల్లోని లక్షలాది మంది ప్రజలు ఒక్కటిగా ఉద్యమిస్తున్నారు. పండుగలకు కూడా దూరంగా ఉంటున్నారు. తెల్లారింది మొదలు.. రాత్రయ్యే వరకు శిబిరాల్లోనే గడుపుతున్నారు. అమరావతి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వరుసగా 83వ రోజూ...రాజధాని గ్రామాల్లో ఉద్యమ సెగలు ప్రజ్వరిల్లాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఎర్రబాలెం, రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, పెనుమాక, ఉండవల్లి, నేలపాడు,14వ మైలులో ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి.
రాష్ట్రమంతా స్థానిక సంస్థల ఎన్నికల వేడిలో ఉంటే.. అమరావతిలో రాజధాని రణం కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు భయపడ్డ ప్రభుత్వం.. 3 రాజధానులపై మొండిగా ముందుకే వెళ్తానంటోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాక.. CM విశాఖ నుంచి పాలన సాగించేందుకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో తమకు జరిగిన కుట్రను తలుచుకుని రగిలిపోతున్నారు రైతులు. రోజుకో రీతిలో నిరసనలు తెలుపుతున్నారు రైతులు. హోలీ సందర్భంగా మందడంలో ముఖాలకు నల్ల రంగు పూసుకొని ఆందోళనకు దిగారు.
అమరావతి ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొంటున్న జేఏసీ నేతలందరిపైనా కేసులు నమోదవుతున్నాయి. అయితే అక్రమ కేసులు పెడుతున్నా.. జేఏసీ నేతలు వెనుకడుగు వేయడం లేదు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నా.. భయభ్రాంతులకు గురిచేస్తున్నా వెరవకుండా నిరసలు కొనసాగిస్తున్నారు.
శిబిరాల్లో జై అమరావతి తోపాటు రకరకాల ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారు రైతులు. ప్రభుత్వమే ఒప్పందాలను ఉల్లంఘిస్తే.. ప్రజా ప్రభుత్వం అంటారా? అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com