ఉత్కంఠ రేపుతున్న టీపీసీసీ మార్పు అంశం

ఉత్కంఠ రేపుతున్న టీపీసీసీ మార్పు అంశం

తెలంగాణ పీసీసీ మార్పు జరుగుతుందని గత కొంత కాలం గా విస్తృత ప్రచారం జరుగుతుంది. ఎన్నికల్లో ఓడిన ప్రతి సారి ఈ చర్చ తెరమీదకు వస్తూనే ఉంది. కాని పీసీసీ మార్పు జరగడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సుధీర్ఘ కాలంగా పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. అయితే వరుస ఓటముల తర్వాత కూడా అధిష్టానం పీసీసీని మార్చక పోవడం వెనక పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పదవి వదులుకునేందుకు పీసీసీ చీఫ్ ససేమిరా అంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పదవి నుండి తప్పుకుంటారని భావించినా.. అది జరగలేదు. అధినేత్రి సోనియాకు తాను తప్పుకుంటానని ఉత్తమ్ ఎక్కడ చెప్పలేదని.. రాజీనామా లేఖ అందించలేదంటున్నారు సీనియర్లు. ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే తప్ప పదవి వదులుకునేందుకు ఉత్తమ్ ససేమీరా అంటున్నారని తెలుస్తోంది.

అయితే ముందుగా ఏఐసీసీ ప్రక్షాళన తర్వాతే పలు రాష్టాల పీసీసీ చీఫ్ లను మార్చాలని అధిష్టానం భావిస్తుందని సమాచారం. అందుకే ప్రస్తుతం ఉత్తమ్ నే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తమ్ స్థానంలో ఎవరికి పీసీసీ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టాలనే దానిపై కాంగ్రెస్‌ నేతల్లో స్పష్టత లేదు. ఎందుకంటే పీసీపీ పదవిపై రాష్ట్రంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. పీసీసీ చీఫ్ పదవి రేసులో చాలా మంది నేతలు పోటి పడుతున్నారు. తమకు పార్టీ పదవి కట్టబెడితే కాంగ్రెస్ పూర్వ వైభవం సాధిస్తుందని ఢిల్లీలో లాభియింగ్ చేస్తున్నారు. పదవి రాకపోతే అధిష్టానంతో అమీ తూమీ తేల్చుకునేందుకు కాచుకు కూర్చుకున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఒక వర్గానికి పీసీసీ పదవి కట్టబెడితే మరో వర్గం పార్టీకి దూరం అయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తోంది హైకమాండ్‌. ఆశావాహులందరితో చర్చించి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని భావిస్తోంది. అందుకే పీసీసీ చీఫ్ మార్పు ఆలస్యమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కారణాలు ఏలా ఉన్నా ఉత్తమ్ నే పీసీసీ చీఫ్ గా కొనసాగిండం పట్ల ఓ వర్గం అసంతృప్తితో రగిలిపోతుంది. వరుస ఓటములతో క్యాడర్ మొత్తం నైరాశ్యంలో మునిగిపోయింది. పార్టీ బలోపేతం కోసం ఉత్తమ్ పని చేయడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు ఆ వర్గం నేతలు. ప్రభుత్వంపై ఆయన పోరాటం చేయకుండా అస్త్ర సన్యాసం చేసారనే విమర్శిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ మునగడం ఖాయమంటున్నారు. అందుకే వీలైనంత తొందరగా పీసీసీ కొత్త చీఫ్ ను నియమించాలని కోరుతున్నారు. అప్పుడే కార్యకర్తల్లో నూతనొత్సహం నిండి కదన రంగంలో దూకుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అధ్యక్ష పదవి కోసం వర్గాల వారీగా నేతలు పోటాపోటీ లాబీయింగ్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు పీసీసీ మార్చి పార్టీలో గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పుడు పీసీసీని మార్చినా కొత్తగా వచ్చే అధ్యక్షుడు పార్టీకి కొత్తగా ఒరగబెట్టింది ఏమీ ఉండదని ఇప్పుడు ఏ ఎన్నికలు కూడా లేని పరిస్థితుల్లో కొత్త పీసీసీ వచ్చి చేసేది ఏమీ ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమర్థవంతంగా పని చేస్తున్నారని.. ఆయన స్థానంలో మరొకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ గందరగోళంలో పడటం ఖాయమంటున్నారు. పీసీసీ ఎంపికలో రాష్ట్ర పార్టీలో నెలకొన్న అభిప్రాయ భేదాలతో కిందిస్థాయి క్యాడర్ లో ఎడతెగని కన్ఫ్యూజన్ నెలకొంది.

పార్టీలో ఏ వర్గపు నేతల విశ్వాసాలు ఏలా ఉన్నా.. జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ పార్టీలో జరుగుతుంది. ఏఐసీసీ ప్రక్షాళన తర్వాత పీసీసీ మార్పు ఉంటుందా? లేక పీసీసీ మార్పు తర్వాతే ఏఐసీసీ ప్రక్షాళన ఉంటుందా? అనేది పార్టీ వర్గాల్లో మాత్రం ఆసక్తిని రేపుతుంది.

Tags

Read MoreRead Less
Next Story