మోదీతో భేటీ అయిన జ్యోతిరాదిత్య.. మధ్యలో ఆగిపోనున్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రయాణం
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరేందుకు రూట్ క్లియర్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. కాసేపటి క్రితం ప్రధాని మోదీని జ్యోతిరాదిత్య సింధియా కలిశారు. అంతా ఊహించినట్టు సింధియా బీజేపీలో చేరితే కమల్‌నాథ్ సర్కార్ కూలిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కాలిసి జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి చర్చించారు. అయితే వీరిద్దరి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు సింధియాకు చెందిన 17 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బెంగళూరు క్యాంపులోనే ఉన్నారు.
రాజ్యసభ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. కీలకనేత జ్యోతిరాదిత్య సింధియా, ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు ఇంకా బెంగళూర్ క్యాంప్‌లోనే ఉన్నారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంటే.. జ్యోతిరాదిత్య సింధియా.. ప్రధాని మోదీని కలవడంతో.. మధ్య ప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. అసెంబ్లీలో బొటాబొటీ మెజారిటీ ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఈ పరిణామం షాక్ ఇచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com