మారుతీరావు సోదరుడు శ్రవణ్‌, కూతురు అమృత పరస్పర ఆరోపణలు

మారుతీరావు సోదరుడు శ్రవణ్‌, కూతురు అమృత పరస్పర ఆరోపణలు

ఆత్మహత్య చేసుకున్న మారుతీ రావు అంత్యక్రియలు.. మిర్యాలగూడలోని శ్మశానవాటికలో ముగిశాయి. అయితే, తండ్రికి తుదిసారి నివాళులర్పించడానికి వచ్చిన అమృతను.. మారుతీరావు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అమృత రావడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. 'మారుతీరావు అమర్ రహే', 'అమృత గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తండ్రి మృతదేహాన్ని చూడకుండానే, క్షణాల వ్యవధిలోనే అమృత తిరిగి వెళ్లియింది. ఆ తర్వాత మారుతీరావు సోదరుడు శ్రవణ్ తన అన్న అంత్యక్రియలు నిర్వహించారు.

తన కూతురు అమృత వర్షిణి దళితుడైన ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని మారుతీరావు.. కక్ష కట్టి ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు. ఆ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లి బెయిల్ మీద విడుదలయ్యారు. ప్రణయ్ హత్య కేసు ట్రయల్స్ కోర్టులో తుది దశలో ఉన్నాయి. తనకు శిక్ష తప్పదనే భయంతోనే కాకుండా కూతురు తన వద్దకు రావడం లేదనే మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

మరోవైపు, మారుతీరావు ఆత్మహత్యకు ప్రధానంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణాలని సమీప మిత్రులు, బంధువులు చెబుతున్నారు. మిర్యాలగూడ పట్టణ సమీపంలోని ఈదులగూడెంలో వ్యాపార సముదాయాన్ని విక్రయించగా, తన సోదరుడికి సైతం ఆ ఆస్తిలో వాటా ఉండటం, సంబంధిత నగదు సోదరుడి వద్దకే చేరడం, బ్యాంకు నుంచి నోటీసులు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు పెరిగినట్లు సమీప మిత్రుల ద్వారా తెలుస్తోంది.

ఇదిలావుంటే, మారుతీరావు ఆత్మహత్య నేపథ్యంలో కుటుంబ కలహాలు వెలుగుచూశాయి. మారుతీరావు సోదరుడు శ్రవణ్‌, కూతురు అమృత పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మారుతీరావు ఆత్మహత్య విషయంలో బాబాయి శ్రవణ్‌ పై అమృత ఆరోపణలు వ్యక్తం చేసింది. అయితే, మారుతీరావు ఆత్మహత్య విషయంలో అమృత తనపై అనుమానం వ్యక్తం చేయడాన్ని శ్రవణ్‌ కొట్టిపారేశారు. అమృత ఆస్తి కోసమే డ్రామాలు ఆడుతోందన్నారు. అమృతను అంత్యక్రియలకు రాకుండా అడ్డుకున్నారన్న దానిపై స్పందించిన శ్రవణ్.. ఆమెకు అసలు తండ్రిపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఉంటే.. శనివారమే మారుతీరావు మృతదేహాన్ని చూసేందుకు ఎందుకు రాలేదన్నారు. ఒకప్పుడు మారుతీరావు మరణవార్తే తనకు శుభవార్తని అమృత మాట్లాడిందన్నారు. ఏ కూతురైనా తల్లీ తాళి తీయాలని కోరుకుంటుందా అని ప్రశ్నించారు. అమృత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు శ్రవణ్‌. తనవల్ల అమృత తల్లికి ప్రాణహాని ఉందనడాన్ని తప్పు పట్టారు. తల్లీకూతుళ్లను విడదీయాలని తాను భావించట్లేదన్నారు. మారుతీరావు ఆస్తిలో తనకు ఒక్క పైసా అవసరం లేదని.. తన సంపాదన తనకు బాగానే ఉందన్నారు. తనపై పెట్టిన కేసుల విషయంలో రాజీకి రావాలని తాను అమృతను కోరనని.. చట్టపరంగా శిక్ష పడితే దేనికైనా సిద్దమని చెప్పారు.

బాబాయి శ్రవణ్‌ ఆరోపణలను అమృత కొట్టిపారేశారు. మారుతీరావు మరణవార్తే తనకు శుభవార్త అని తాను ఎక్కడా కామెంట్ చేయలేదని అన్నారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ప్రూఫ్ చూపించాలన్నారు. ఆస్తి కోసం డ్రామాలు అన్న శ్రవణ్ ఆరోపణలను కొట్టిపారేశారు. తనకు గానీ, తన బాబుకు గానీ, అత్తమామలకు గానీ మారుతీరావు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా అవసరం లేదన్నారు.

మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు కాబట్టే మొదట నమ్మలేకపోయానని అమృత చెప్పారు. అయితే సూసైడ్ నోట్‌లో చేతి రాత తన తండ్రిదేనని.. కాబట్టి ఆత్మహత్యే అనుకుంటున్నామని తెలిపారు. ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు లేవన్నారు. ఆస్తే కావాలనుకుంటే అసలు ప్రణయ్‌తో వచ్చేదాన్నే కాదన్నారు అమృత. పెళ్లి తర్వాత ఆస్తి మొత్తం ట్రస్టుకు రాసిస్తానని వాట్సాప్‌లో మెసేజ్ షేర్ చేశారని.. ఆస్తే కావాలనుకుంటే అప్పుడైనా వెళ్లేదాన్ని అన్నారు. ఆస్తిపై ఆసక్తే ఉంటే ప్రణయ్ హత్య తర్వాతైనా మళ్లీ కుటుంబం వద్దకు వెళ్లిపోయేదాన్ని అని చెప్పారు.

శ్రవణ్‌, అమృత మధ్య తలెత్తిన కుటుంబ కలహాల నేపథ్యంలో.. మారుతీరావు చివరికోరిక తీరేలా కనిపించడం లేదు. అమృతను తల్లి దగ్గరికి వెళ్లాలని సూసైడ్ నోట్ లో రాశారు మారుతీరావు. ప్రస్తుత కలహాలు చూస్తుంటే ఆయన చివరికోరక తీరడం కష్టమే.

Tags

Read MoreRead Less
Next Story