బయటపడుతున్న ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ బాగోతాలు

ఎస్ బ్యాంక్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బ్యాంక్ వ్యవస్తాపకుడు రాణా కపూర్ బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. బ్యాంక్‌ను ముంచేయడానికి రాణా కపూర్ కుటుంబం మొత్తం పని చేసింది. రాణా కపూర్, ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు కలసి పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేశారు. కంపెనీలకు బ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వడం, అప్పులు తీసుకున్న కంపెనీల నుంచి లంచాల రూపంలో డబ్బులు రాబట్టడం, వాటిని షెల్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు చూపి కాజేయడం. ఇది రాణా అండ్ కో స్కెచ్. ప్రజల డబ్బును కొట్టేయడానికి రాణా కపూర్ కుటుంబం ఏకంగా 20 షెల్ కంపెనీ లను ఏర్పాటు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో ఈ విషయం బయటపడింది.
కపూర్ అరెస్ట్‌తో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. డిహెచ్‌ఎఫ్‌ఎల్ వ్యవహారం అలాంటిదే. ఎస్ బ్యాంక్ నుంచి డిహెచ్‌ఎల్‌ఎఫ్‌కు 3 వేల 700 కోట్ల రుణం ఇచ్చారు. ఈ డబ్బు మళ్లీ వెనక్కి రాలేదు. రాదని కపూర్ కుటుంబానికి కూడా తెలుసు. అందుకుగాను వారికి 600 కోట్లు ముట్టాయి. తమకు రావాల్సింది తమకు వచ్చిన తర్వాత కపూర్ కుటుంబసభ్యులు చక్రం తిప్పారు. డిహెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీకి ఇచ్చిన రుణాన్ని నిరర్థక ఆస్థిగా ప్రకటించేశారు. ఇదొక్కటే కాదు, బ్యాంక్ నుంచి అప్పులు తీసుకున్న కంపెనీల్లో చాలా వాటి నుంచి లంచాలు పుచ్చుకున్నారు. మొత్తంగా 2 వేల కోట్ల వరకు వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారు. బ్రిటన్‌లో రెండు అస్సెట్స్ కొనుగోలు చేశారు. ఈ మొత్తం విలువ 5 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఎస్ బ్యాంక్ వ్యవహారంపై ఆర్థికశాఖ, ఆర్బీఐ, ఈడీ లోతుగా ఆరా తీస్తున్నాయి. సీబీఐ కూడా రంగంలోకి దిగింది. రాణాకపూర్‌ను ఈడీ అధికారులు దాదాపు 30 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు. రాణా కపూర్ భార్యను కూడా విచారించారు. ముంబైలోని రాణా కపూర్ ఇంట్లో విస్తృతంగా సోదాలు చేశారు. సీబీఐ కూడా తనిఖీలు చేసింది. ముంబైలోని ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. కపూర్ కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు.
Tags
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com