స్థానిక ఎన్నికల్లో వైసీపీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో వైసీపీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో.. చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ వచ్చినా కూడా విగ్రహాలకు ముసుగులు వేయలేదని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారంటూ ఈసీపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని నియంత్రించడం.. ఎన్నికల కమీషన్‌కు చేతకాదా అంటూ ప్రశ్నించారు.
వైసీపీ చేసిన పనికి బీసీలకు 24 శాతం కంటే తక్కువ రిజర్వేషన్లు, బీసీలను రాజకీయ సమాధి చేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు చంద్రబాబు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయా?.. వైసీపీ ఆధీనంలో జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. వైసీపీ విచ్చలవిడి తనానికి హద్దులేకుండా పోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుల ధృవపత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా టీడీపీ అభ్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. వీఆర్వో, పంచాయతీ అధికారులు అందుబాటులో లేరని, వైసీపీ ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్ మాట వినట్లేదా? అని చంద్రబాబు అన్నారు. ఎవరైనా నామినేషన్ వేయలేకపోతే బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనన్నారు.
నామినేషన్ వేసేందుకు వెళ్తుంటే దాడులు చేస్తున్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సక్రమంగా జరగకపోతే ఊరుకోమన్నారు చంద్రబాబు. టీడీపీ నేతలను ప్రలోభాలు పెట్టి వైసీపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. నాయకులను తయారు చేయడం టీడీపీకి కొత్త కాదన్నారు. జగన్‌కు ఎన్నికల కోడ్ వర్తించదా?, విద్యార్థులకు కిట్లు ఇస్తామని సీఎం జగన్ చెప్పడం కోడ్ ఉల్లంఘన కిందకి రాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com