ఆనంద్‌ రెడ్డి హత్యతో సిఐ ప్రశాంత్ రెడ్డికి సంబందం ఉందా...?

ఆనంద్‌ రెడ్డి హత్యతో సిఐ ప్రశాంత్ రెడ్డికి సంబందం ఉందా...?

వరంగల్ జిల్లాలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన లేబర్‌ అసిస్టెంట్‌ అధికారి ఆనంద్‌ రెడ్డి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి జిల్లా గోళ్ల బుద్ధారం అటవీ ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆనంద్‌ను హత్య చేసినట్లు వ్యాపారి ప్రదీప్‌ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఓ లావాదేవీ వ్యవహారంలో 80 లక్షలు ఇస్తానంటూ ప్రదీప్‌, ఆనంద్‌ను భూపాలపల్లికి పిలిచాడు. ఆ తర్వాత నుంచి ఆనంద్‌ కనిపించలేదు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయటకు వచ్చింది.

అయితే ఈ హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. ఇప్పటికే రాంపూర్‌-గోళ్లబుద్దరం మధ్య అడవిలోకి పోలీసుల బృందం చేరుకుంది. క్లూస్‌ టీంతో పాటు పోస్టుమార్టం టీం మృతదేహం దగ్గరకు చేరుకున్నాయి. ఆనంద్‌ రెడ్డి మృతదేహానికి అక్కడే పంచనామా చేయనుంది పోస్టుమార్టం టీం. క్లూస్‌ టీంతో పాటు ఆనంద్‌ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. వారి సమక్షంలోనే పంచనామా చేయనున్నారు.. తరువాత అక్కడ నుంచి అతడి స్వస్థలానికి మృత దేహాన్ని తరలించనున్నారు..

అయితే కిడ్నాప్‌ అయ్యారు అనుకున్న అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ 44 ఏళ్ల ఆనంద్‌రెడ్డి దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది. తీసుకున్న అప్పును ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఆనంద్‌రెడ్డి చేస్తున్న ఇసుక వ్యాపారంలో భాగస్వామి, స్నేహితుడు అయిన ప్రదీప్‌ రెడ్డి ప్రణాళిక ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రదీప్‌కు అతడి డ్రైవర్‌ నిగ్గుల రమేశ్‌, మరో ఇద్దరు సహకరించారు. భూపాలపల్లి రూరల్‌ మండలంలోని ఓ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఆనంద్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది.

ఇదిలావుంటే ఆనంద్ రెడ్డి హత్యకేసులో ప్రధాన ముద్దాయి ప్రదీప్ రెడ్డి.. హత్యవిషయం లో తన సోదరుడి సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ప్రదీప్ రెడ్డి సోదరుడు ప్రశాంత్ రెడ్డి తో హత్యకు ముందు ఆతర్వాత కూడా ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. హత్య కు ముందు మాట్లాడినా ఆ తర్వాత మాట్లాడినా ఎందుకు ప్రశాంత్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అనేది ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది. వరంగల్ పోలీసులు ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి ని విచారించారని తమకు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.

Tags

Next Story