బెంగళూరును బెంబేలెత్తిస్తోన్న కరోనా వైరస్

బెంగళూరును బెంబేలెత్తిస్తోన్న కరోనా వైరస్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత ఐటీ రాజధాని బెంగళూరును బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే అక్కడ తొలి కేసు నమోదుకాగా.. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. కొత్తగా మూడు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు వెల్లడించారు. ప్రస్తుతం కర్నాటకలో కోవిడ్‌-19 నలుగురికి ఉన్నట్లు నిర్థారించామని, వారిని, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఉంచి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలుపుతూ శ్రీరాములు ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, వైరస్‌ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అటు కరోనా ప్రభావంతో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం యడ్యూరప్ప వైద్య శాఖ అధికారులతో చర్చించారు. వైరస్ మరింతగా విస్తరించకుండా వుండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ టెక్కికి కరోనా వైరస్ వున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అటు ముందు జాగ్రత్త చర్యగా ప్రాథమిక పాఠశాలలు మూసివేశారు. అయితే, కరోనా సోకిన టెక్కీ 2 వేల 666 మందిని కలిసనట్టు అంచనా వేస్తున్నారు. అతనితో పాటు బస్సు, విమానం, కారులో ప్రయాణించిన వారందరినీ గుర్తించి గృహనిర్బంధంలో వుంచినట్టు తెలుస్తోంది. వారందరికీ వైద్యసేవలు అందిస్తున్నట్టు సమాచారం.

అటు కేరళలో సైతం కొత్తగా మరో ఆరు కేసులు నమోదైనట్టు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో కేరళలో వైరస్ బారిన పడినవారి సంఖ్య 12 కు చేరుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని పినరయి విజయన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వపరమైన వేడుకలను కూడా రద్దు చేశారు. అంతేకాకుండా మార్చి 31 వరకు స్కూల్స్‌, థియేటర్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక మహారాష్ట్రలోనూ కొత్తగా మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. పుణేలో ముగ్గురికి కోవిడ్‌-19 పాజిటీవ్‌ వచ్చింది. దీంతో మహారాష్ట్రలో వైరస్‌ బాధితుల సంఖ్య ఐదుకి పెరిగింది. ఇటీవలె దుబాయ్‌ నుంచి ఇద్దరిలో వైరస్‌ పాజిటీవ్‌ అని వచ్చింది. ఆ ఇద్దరితో క్లోజ్‌ గా తిరిగటంతో మరో ముగ్గురికి వైరస్‌ వ్యాపించింది. తాజాగా, కర్నాటక, మహారాష్ట్ర, కేరళలలో నమోదైన కేసులతో.. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 59 కు చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story