ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చిన హైకోర్టు
పంచాయతీ ఆఫీస్‌తో మొదలుపెట్టి వాటర్ ట్యాంక్ నుంచి శ్మశానం వరకూ దేన్నీ వదలకుండా వైసీపీ రంగులు వేసినందుకు ఏపీ ప్రభుత్వానికి గట్టిగానే షాక్ ఇచ్చింది హైకోర్టు. పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీస్‌లకు పార్టీ రంగులు తొలగించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 10 రోజుల్లో రంగులు తొలగించాలని, సీఎస్ నిర్ణయం ప్రకారం మళ్లీ కొత్త రంగులు వేయాలని స్పష్టం చేసింది. అలాగే తమ ఆదేశాలు అమలు చేసినట్టు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వర్రావు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించిందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. బాత్‌రూమ్‌లను కూడా వదిలిపెట్టకుండా రంగులేస్తున్నారని మండిపడ్డారు. రంగులు వేయడానికి, తీయడానికి 3 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మండిపడ్డారు చంద్రబాబు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వివిధ పథకాలు, పనుల రద్దులతోపాటు రంగులేయడం కూడా మొదలెట్టింది. వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఇలాంటి విపరీత ధోరణి ఎక్కడా లేదని విపక్షాలు మండిపడ్డాయి. ఐనా ఏకపక్షంగానే ముందకెళ్లిన ప్రభుత్వం.. వాటర్ ట్యాంక్‌లు, పంచాయతీ ఆఫీస్‌లు అన్నింటికీ 3 రంగులు పులిమేసింది. కొన్ని చోట్ల పంచాయతీ ఆఫీస్‌లకు ఉన్న జాతీయ జెండా రంగులను కూడా కాదని పార్టీ రంగులేశారు. దీనిపై పెను దుమారం రేగింది. చివరికి హైకోర్టులో పలు దఫాలుగా విచారణ తర్వాత రంగులు తొలగించాల్సిందేనంటూ ఆదేశాలు వెలువడ్డాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com