కాంగ్రెస్ కు భారీ దెబ్బేసిన జ్యోతిరాధిత్య సింథియా

కాంగ్రెస్ కు భారీ దెబ్బేసిన జ్యోతిరాధిత్య సింథియా

జ్యోతిరాధిత్య సింథియా..నిన్నటివరకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్‌కు ఆశాజ్యోతి. గాడితప్పిన పార్టీకి జీవం పోసి సీఎం పదవి వరకు తీసుకెళ్లి దిక్సూచిలా కనిపించారు. రాజవంశం నుంచి వచ్చినా మాస్, క్లాస్ ఓట్ పల్స్ తెలిసిన లీడర్. 2018 ఎన్నికల ముందు వరకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కలవరమే కనిపించింది. కానీ, సింథియా అంతా తానే అయి నడిపించారు. సవాళ్లను అధిగమించి కేడర్ ను కూడదీసుకొని పార్టీకి విజయం అందించారు. అయితే.. అంత కష్టపడినా సీనియారిటీకే ఇంపార్టెన్స్ ఇచ్చిన హైకమాండ్ కమల్ నాథ్ కే సీఎం పగ్గాలు అప్పజెప్పింది. ఇక అక్కడ్నుంచి కాంగ్రెస్ వర్సెస్ సింథియాకు బీజం పడింది. పార్టీ మారాలన్న ఆలోచన అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఏడాదిగా సింథియా పలు సందర్భాల్లో పార్టీ మార్పులపై ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తూనే ఉన్నారు.

నిజానికి జ్యోతిరాధిత్య సింథియా వంశంలో అంతా బీజేపీ నేతలే. సింథియా నాన్నమ్మ, మేనత్తలు బీజేపీ లీడర్లే. కేరీర్ తొలి రోజుల్లో జ్యోతిరాథిత్య సింథియా తండ్రి మాధవరావు సింథియా కూడా జనసంఘ్ లోనే ఉన్నా.. ఆ తర్వాత కాంగ్రెస్ కు ఆరారు.. అప్పట్లో ఆ నిర్ణయం మాధవరావుకు అతని తల్లికి చిచ్చుపెట్టినా.. ఆయన వెనకడుగు వేయలేదు. తండ్రి మరణం తర్వాత జ్యోతిరాథిత్య సింథియా కూడా అంతే కమిట్మెంట్ తో కాంగ్రెస్ లో కష్టపడ్డారు. రాహుల్ కు సమవయస్కుడు కావటంతో ఆయనకు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. కేంద్రమంత్రి పదవి కూడా దక్కింది. అయితే..మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలు సింథియా ఆలోచనలను మార్చేశాయి.

సీఎం పదవి దక్కకున్నా.. డిప్యూటీ సీఎం పదవైనా ఇస్తారని ఆశపడ్డ సింథియాకు ఆశాభంగం తప్పలేదు. దాన్నుంచి కోలుకునే లోపే మరో భంగపాటు ఎదురైంది. సీఎం పదవి చేపట్టాక పీసీసీ పదవికి కమల్ నాథ్ రాజీనామా చేస్తారని భావించారంతా. కానీ, ఆయన పార్టీ పగ్గాలు కూడా వదల్లేదు. దీంతో సింథియా వర్గంలో అసంతృప్తి మరింత పెరిగింది. దీంతో గత ఆగస్టులోనే పార్టీ అధిష్టానికి అల్టిమేటం ఇచ్చారాయన. పీసీసీ పదవి ఇవ్వకుంటే తన దారి తాను చూసుకుంటానంటూ తిరుగుబాటు స్వరం అందుకున్నారు. ఇక ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ ఆయన పార్టీ లైన్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చి పార్టీకి షాకిచ్చారు. పార్టీ మొత్తం 370కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో మోదీ ప్రభుత్వ నిర్ణయంపై సింథియా ప్రశంసించారు. మరోసారి తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో కాంగ్రెస్ పేరును తొలగించారు. దానికి బదులు ప్రజాసేవకుడు అని అప్ డేట్ చేశారాయన. దీనికితోడు 20 మంది ఎమ్మెల్యేలు పార్టీతో టచ్ లో లేకుండా పోయారనే ప్రచారం మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ లో బాంబు పేల్చింది.

ఈ వరుస పరిణామాలు కాంగ్రెస్ లో జ్యోతిరాథిత్య సింధియా కొనసాగటం కష్టమేనని తేలిపోయింది. అయినా.. పార్టీ వదలివచ్చే అవకాశాలు లేవని చెబుతూ వచ్చిన సింథియా.. ఇప్పుడు పార్టీ మారి బీజేపీలోకి చేరుతుండటం కమలం పార్టీ కేడర్ లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. అయితే..బోటాబోటి సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమల్ నాథ్ కు ఈ పరిణామాలు కుర్చీ కింద సునామీ సృష్టించాయి. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు తమ పదవులకు గుడ్ బై చెప్పటంతో కమల్ నాథ్ సర్కార్ కు కష్టాలు మొదలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story