గుది బండగా మారిన రాజీవ్ స్వగృహ ఇళ్ల సమస్య పరిష్కారమైనట్లే

గుది బండగా మారిన రాజీవ్ స్వగృహ ఇళ్ల సమస్య పరిష్కారమైనట్లే

రాజీవ్ సృగృహ ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి విక్రయానికి విధివిధానాలను ఖరారు చేయడానికి గృహ నిర్మాణ శాఖకు ఇన్‌చార్జిగా ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నిరర్థక ఆస్తులను విక్రయించి ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి హరీష్‌రావు కూడా రాజీవ్‌ స్వగృహ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ భూముల విక్రయంతో పాటు రాజీవ్ సృగృహ ఇళ్లను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చోకోనున్నట్టు వివరించారు.

మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్ సృగృహ పథకాన్ని తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, పోచారం వద్ద రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టింది అప్పటి ప్రభుత్వం. వీటి కోసం 1,621.26 కోట్లు ఖర్చు చేసింది. అయితే మార్కెట్ ధర కంటే రాజీవ్ సృగృహ ఇళ్లకు ఖరారు చేసిన రేట్లు ఎక్కువగా ఉండడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నిర్మాణం పూర్తయినా కొనుగోలు చేసేవారు లేక అవన్నీ అలాగే ఉండిపోయాయి. దీంతో వీటి నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలకు వడ్డీలు ప్రభుత్వానికి భారమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలు, వాటికి అయిన వడ్డీతో సహా కేసీఆర్‌ సర్కార్‌ 1,071.39 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత వీటిని తక్కువ ధరకు కేటాయించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారం 2017 నుంచి పెండింగ్‌లో ఉంది. తాజాగా బండ్లగూడ రాజీవ్ సృగృహ ప్రాజెక్టులో నిర్మాణం పూర్తయిన 309 ప్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 1,931 ప్లాట్లు, పోచారం ప్రాజెక్టులో అసంపూర్తిగా ఉన్న 954 ప్లాట్లు, పూర్తయిన 1,650 ప్లాట్లను ఉద్యోగులకు సరసమైన రేట్లకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, తాజాగా ఖరారు చేసే రేట్లకు ఉద్యోగులు అంగీకరిస్తే ప్రభుత్వానికి గుది బండగా మారిన రాజీవ్ స్వగృహ ఇళ్ల సమస్య పరిష్కారమైనట్లే.

Tags

Read MoreRead Less
Next Story