గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి ఓ వైపు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం మరోవైపు కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో రెండోరోజు నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.. వైసీపీ నేతలు అరాచకాలు సృష్టించారు. మాచవరం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు వైసీపీ నేతలు. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. టీడీపీ నేతలు, వైసీపీ నేతలు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది.
వెల్దుర్తి మండలం బోయలవీడులో టీడీపీ ఎంపీటీసి అభ్యర్థి నాగేంద్రం నామినేషన్ పత్రాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఎన్నికల అధికారి పరిశీలిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.. అయితే, ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం అనుమానాలకు తావిస్తోంది.
ఇక మద్యం సీసాలు దొరకడం, పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది.. రేపల్లె నియోజకవర్గం నగరం మండలంలోని ఈదుపల్లిలో ఆళ్ల చౌదరికి చెందిన పశువుల పాకలో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. దీనిపై కేసు నమోదు చేసి ఆళ్ల చౌదరిని అదుపులోకి తీసుకున్నారు.. అధికార పార్టీ అరాచకాల్లో భాగమేనంటూ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టీడీపీ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు.. పోలీసుల్ని ఉపయోగించుకుని అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.
కర్నూలు జిల్లాలోనూ వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. చిప్పగిరి మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధి రజని నామినేషన్ పత్రాలను వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు చించేశారు. వైసీపీ నేతల దౌర్జనాన్ని అక్కడి పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోకపోవడం విశేషం. పైగా... వైసీపీ నేతలకు... వీరు వంతపాడుతున్నారు. విషయం తెలుసుకుని ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ హూటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com