రాజధానికోసం ఒక్కతాటిపై నడుస్తున్న 29 గ్రామాలు

రాజధానికోసం ఒక్కతాటిపై నడుస్తున్న  29 గ్రామాలు
X

అమరావతి ఉద్యమం 86 వరోజుకు చేరింది. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ 29 గ్రామాలు ఒక్కతాటిపై నడుస్తున్నాయి. రైతుల్లో.. మహిళల్లో పట్టుదల ఏ మాత్రం సడలలేదు. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉండవల్లి, తుళ్లూరు, నేలపాడు, పెదపరిమి, యర్రబాలెం సహా అన్ని చోట్లా పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి దీక్షా శిబిరాల్లో కూర్చుంటున్నారు. అమరావతి అంటే శ్మశానం కాదు బంగారు భూమి అంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు..

మందడంలో మణిద్వీపం వర్ణన పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. అమరావతి సుభిక్షంగా చిరస్థాయిగా ఉండాలని కాంక్షించారు. జగన్ మనసు మార్చాలని వేడుకున్నారు. ఈ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాయపూడిలో శాంతిహోమం నిర్వహించారు గ్రామస్థులు.. స్థానిక పోలేరమ్మ గుడి దగ్గర నిర్వహించిన పూజల్లో రాజధాని రైతులు పాల్గొన్నారు..

ప్రజా రాజధాని అమరావతిని కూలదోసేందుకు జగన్ సర్కార్‌ కుట్రలెందుకు పన్నిందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు రైతులు . అమరావతిని రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామంటున్నారు. ఇంత ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోని సర్కార్‌ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.

స్థానిక సమరం సెగలు అమరావతిలోనూ భగభగమంటున్నాయి. ప్రభుత్వానికి దమ్ముంటే రాజధాని గ్రామాల్లోనూ ఎన్నికలు పెట్టాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే ప్రజాభిప్రాయం ఎటువైపు ఉందో తేలిపోతుందంటున్నారు. ఓటమి ఖాయమనే.. అమరావతి గ్రామాల్లో ఎన్నికలు పెట్టడం లేదని ఆక్షేపిస్తున్నారు.

అమరావతి ఉద్యమాన్ని తట్టుకోలేక.. 3 రాజధానులకు మద్దతు అంటూ పెయిడ్‌ ఆర్టిస్టులతో ప్రభుత్వం మందడంలో శిబిరాన్ని నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు..అటు రైతుల పోరాటానికి పలువురు దాతల విరాళాలు ఇస్తున్నారు. అటు ఇతర జిల్లాల నుంచి వచ్చి కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు.

Tags

Next Story