డీజీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు నిరసన
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. టీడీపీ నేతలతో కలిసి న్యాయ పోరాటం చేస్తున్నారు.. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు.. మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ నేతలతో కలిసి డీజీపీ ఆఫీస్‌కు పాదయాత్రగా వెళ్లారు చంద్రబాబు. అయితే, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరుతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాడులపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీస్‌కు వెళ్లగా.. డీజీపీ లేరంటూ గేట్లు మూసేశారు పోలీసులు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన చంద్రబాబు.. టీడీపీ, సీపీఐ నేతలతో కలిసి డీజీపీ కార్యాలయం ముందే బైఠాయించారు. పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఫైరయ్యారు. ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. డీజీపీని కలిసే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అయితే, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అక్కడకు వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా దాడిలో టీడీపీ నేతలకైన గాయాలను అడిషనల్ డీజీకి చూపించారు. మాచర్లలో జరిగిన దాడిని ఆయనకు వివరించారు. హైకోర్టు న్యాయవాది కిషోర్‌పై జరిగిన దాడి చిత్రాలను, చొక్కా రక్త సిక్తమైన ఫొటోలను వారికి చూపించారు.
ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ప్రజాస్వామ్య వాదులంతా దీనిని ఖండించాలన్నారు. వైసీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్నారు. గెలవకుంటే రాజీనామా చేయాలని సీఎం బెదిరించారని, అందుకే వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులను కోరారు చంద్రబాబు. పోలీసులతోపాటు ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత దాడికి గురైన కార్లను కూడా అడిషనల్ డీజీకి చూపించారు చంద్రబాబు. ప్రజాప్రతినిధులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యులకు ఎవరు రక్షణ కల్పిస్తారని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అటు సీపీఐ నేత రామకృష్ణ కూడా ఈ ఘటనను ఖండించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com