సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లడం దురదృష్టకరం : సచిన్ పైలట్

సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లడం దురదృష్టకరం : సచిన్ పైలట్

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు షాకిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ గూటికి చేరారు. ఆ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

జ్యోతిరాదిత్య సింధియాకు పార్టీ కండువా కప్పి.. ప్రాథమిక సభ్యత్వ రశీదు అందజేశారు జేపీ నడ్డా. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. సింధియా రాకతో మధ్యప్రదేశ్ లో బీజేపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తనను బీజేపీలోకి ఆహ్వానించిన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు జ్యోతిరాదిత్య. దేశ భవిష్యత్తు ప్రధాని మోదీ చేతుల్లో భద్రంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన అంతమ లక్ష్యమని, దాని కోసమే బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సైతం సింధియా విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

మరోవైపు... పార్టీలో చేరగానే జ్యోతిరాదిత్యకు సముచిత స్థానం దక్కింది. ముందునుంచి ఊహించినట్టే ఆయనను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 11 మందితో కూడిన రాజ్యసభ నామినేషన్‌ జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇందులో జ్యోతిరాదిత్య పేరు కూడా వుంది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా కట్టబెట్టేనున్నట్లు తెలుస్తోంది...

జ్యోతిరాదిత్య చేరికను స్వాగతించారు బీజేపీ నేతలు. జ్యోతిరాదిత్య రాకతో మధ్యప్రదేశ్ లో బీజేపీ మరింత బలపడుతుందని.. మాజీ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షడు వి.డి. శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

జ్యోతిరాదిత్య బీజేపీలో చేరటాన్ని ఆయన మేనత్త, ఆ పార్టీ ఎమ్మెల్యే యశోధర రాజే స్వాగతించారు. జ్యోతిరాదిత్య సింధియా రాకను వాపసీతో పోల్చారు.

జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌ను వీడటంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఏ సమయంలోనైనా తమ ఇంట్లోకి వచ్చే స్వాతంత్య్రం ఆయనకు ఉందంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. 2018 డిసెంబర్లో పెట్టిన సమయము, సహనము అనే రెండే అత్యంత శక్తివంతమైన పోరాట యోధులు..’’ రీట్వీట్ చేశారు. దీంతోపాటు సీఎం కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య, రాహుల్ చెరోవైపు నిలబడిన ఓ ఫోటో కూడా ఇందులో ఉంది.

ఇక.. సచిన్ పైలట్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లడం దురదృష్టకరం. ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే పార్టీలో చర్చించి పరిష్కరించుకుంటే బాగుండేది...’’ అంటూ ట్వీట్‌ చేశారు.

సింధియాను కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవించిందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్. పార్టీని వీడేముందు కనీసం ఆ గౌరవంతోనైనా ఆలోచించాల్సి వుండాల్సిందన్నారు.

మొత్తానికి.. జ్యోతిరాదిత్య ... కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరడంతో.. ఓ అంకం పూర్తైనట్లైంది. ఇక బీజేపీ నేతగా...తనదైన ముద్రవేయనున్నారు జ్యోతిరాదిత్య సింధియా.

Tags

Read MoreRead Less
Next Story