అధికార పార్టీ చేసిన తప్పిదానికి కోర్టు ముందు హాజరవుతున్న డీజీపీ

అధికార పార్టీ చేసిన తప్పిదానికి కోర్టు ముందు హాజరవుతున్న డీజీపీ

ఏపీలో కొద్ది నెలలుగా శాంతిభద్రతలు అదుపుతప్పినట్టే కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పిదాలకు పోలీస్ బాస్‌లు కోర్టుల్లో వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. నెల రోజుల వ్యవధిలో DGP రెండుసార్లు హైకోర్టుకు హాజరవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గురువారం DGP గౌతం సవాంగ్‌ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో సెక్షన్ 151 కింద నోటీసు ఇవ్వడం, అరెస్టు చేయడానికి సంబంధించిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. స్వయంగా పోలీసు బాసే వచ్చి వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే సవాంగ్ హాజరయ్యారు.

ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖ వెళ్లిన సమయంలో చంద్రబాబును ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. 151 కింద నోటీసులిచ్చి ఆయన్ను అరెస్టు చేసి వెనక్కి తిప్పిపంపారు. ఈ ఘటనలో పోలీసుల తీరు తప్పుపడుతూ TDP మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులే అనుమతి ఇచ్చి కనీస భద్రత కల్పించకుండా.. చివరికి వెనక్కు పంపడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా DGP స్వయంగా హైకోర్టుకు వెళ్లారు. ఈ పరిస్థితి DGP గౌతం సవాంగ్‌ను ఒత్తిడికి గురి చేసిందనే మాట వినిపిస్తోంది. పోలీస్ బాస్‌ ఎంత నిజాయతీపరులైన అధికారి అయినా.. అధికారపక్షం ఒత్తిళ్ల కారణంగా కొన్ని చోట్ల ఏర్పడుతున్న ఇబ్బందికర పరిస్థితులు గౌతం సవాంగ్‌ను ఇబ్బంది పెట్టాయంటున్నారు.

చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన కోసం వెళ్లినప్పుడు YCP కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ను ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ముందస్తుగా ఇలాంటిది జరుగుతుందని తెలిసి కూడా వారిని నిలువరించలేకపోయారని పోలీసులపై విమర్శలు వచ్చాయి. రాత్రి వరకూ ఉద్రిక్త వాతావరణమే ఉండడంతో చివరికి బాబును వెనక్కి పంపేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌-CRPC సెక్షన్ 151 కింద నోటీసులు ఇస్తున్నట్టు చిన్న పేపర్‌పై రాసి ఆయన్ను అరెస్టు చేసి అక్కడి నుంచి హైదరాబాద్‌ ఫ్లైట్ ఎక్కించారు. అదే ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. ఎవరైనా వ్యక్తి తీవ్ర నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని భావించినప్పుడే ముందస్తుగా వాటిని నిలువరించేందుకు 151 సెక్షన్ కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేస్తారు. ఈ తరహా నోటీసులు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో చివరికి DGP వచ్చి కోర్టుకు వివరణ ఇవ్వాల్సివచ్చింది.

చంద్రబాబును అరెస్ట్ చేసిన మర్నాడే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఒక వ్యక్తి నేరం చేయకుండా అదుపు చేసేందుకు మాత్రమే సెక్షన్ 151 కింద నోటీసు ఇస్తారని.. కానీ విశాఖ DCP అలాంటి నోటుసు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. చంద్రబాబు రక్షణ కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. దీనిపై తదుపరి విచారణలో భాగంగానే గురువారానికి DGPని కోర్టుకు రావాలని ఆదేశించింది.

Tags

Next Story