బండి సంజయ్ కుటుంబంలో పండగ వాతావరణం

బండి సంజయ్ కుటుంబంలో పండగ వాతావరణం

ఎంపీ ఎలక్షన్ల నుంచి తెలంగాణలో బీజేపీ కొత్త ఒరవడి చూపిస్తోంది. పాత ఫార్ములాతో రాజకీయాలకు భిన్నంగా జనంలోకి వెళ్తోంది. లోక్ సభ ఎలక్షన్ల అనూహ్యంగా ఐదు స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో అధిష్టానం కూడా తెలంగాణపై మరింత ఫోకస్ చేసింది. అనాటి నుంచి పార్టీలో కొత్త తరం నాయకత్వానికి అధిష్టానం అవకాశం ఇస్తుందనే అంచనాలు పెరిగాయి. మరోవైపు సీనియారిటీకే ప్రధాన్యం ఇచ్చి లక్ష్మన్ నే అధ్యక్షుడిగా కొనసాగిస్తారని చివరికి వరకు ప్రచారం జరిగింది. కానీ, ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో బీజేపీ జాతీయ నాయత్వం తెలంగాణలో పార్టీ బాధ్యతలను బండి సంజయ్ కి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరు ప్రకటించగానే ఆయన అనుచరులు పటాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు.

అయితే..బీజేపీ ప్రెసిడెంట్ పోస్టు విషయంలో లక్ష్మణ్ పేరును కాకుండా మరోకరి పేరును అధిష్టానం పరిశీలిస్తే తమకే అవకాశం కల్పించాలని ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి కూడా తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే..సంజయ్ కి ఆర్ఎస్ఎస్ , ఏబీవీపీలో పనిచేసిన అనుభవంతో పాటు ఇతర సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీకి ఆయన ఎన్నో ఎళ్లుగా వివిధ హోదాలో సేవలు అందించారు. బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్ లో క్రీయాశీలకంగా ఉండేవారు. కరీంనగర్ ఏబీవీపీ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచార ఇన్ ఛార్జ్ గా, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, యువమోర్చా జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. బీజేపీ అగ్రనేత అద్వానీ చేపట్టిన సురాజ్ రథయాత్రలో వెహికల్ ఇన్ ఛార్జ్ గా పనిచేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత 48వ డివిజన్ నుంచి రెండు సార్లు కార్పొరేటర్ గా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున కరీంనగర్ శాసనసభ స్థానానికి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2019లో ఎంపీగా గెలుపొందారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బండి సంజ‌య్ పై ఓ వ‌ర్గం వారు ఆయ‌న ఇంటిపై పనిగట్టుకొని దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. అయినా ఏమాత్రం వెన‌కాడకుండా పార్టీలోనే కొనసాగారు. ఇదే ఆర్ఎస్ఎస్ దృష్టిని ఆక‌ర్శించింది. రాష్ట్ర బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ల‌క్ష్మ‌ణ్ నే కొన‌సాగించాలంటూ ఒత్తిడి తెచ్చినా ఆర్ఎస్ఎస్ ప‌ట్టుబ‌ట్టి బండి సంజ‌య్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేలా ఒత్తిడి పెంచింది. యూత్ పాలోయింగ్ తో పాటు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునే స‌త్తా ఉంద‌న్న న‌మ్మ‌కంతో జాతీయ నాయ‌క‌త్వం కూడా సంజ‌య్ వైపే మొగ్గుచూపించాల్సి వచ్చింది. సంజయ్ నాయత్వంలో పార్టీని బలోపేతం అవుతుందని కేడర్ ధీమా వ్యక్తం చేస్తోంది.

బండి సంజయ్ కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పటంతో ఆయన కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. కరీంనగర్ లో పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. నూత‌న అద్య‌క్షుడిగా ఎన్నికైన సంజ‌య్ నాయ‌క‌త్వాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని బీజేపీ రాష్ట్ర నేత‌లు చెబుతున్నారు. గ‌తంలో హైద‌రాబాదీల‌కు మాత్ర‌మే రాష్ట్ర అద్య‌క్ష‌ప‌ద‌వి అన్న అప‌వాదు ఉండేది.ఆ అప‌వాదును చెరిపేయ‌డంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెబుతున్నారు.

Tags

Next Story