కరోనా ప్యానిక్ నుంచి కోలుకుంటోన్న హైటెక్ సిటీ

కరోనా ప్యానిక్ నుంచి కోలుకుంటోన్న హైటెక్ సిటీ

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్..సౌత్ ఇండియాలోనూ పాగా వేస్తోంది. కర్ణాటక, కెరళాలో కేసులు నమోదైనా తెలుగు రాష్ట్రాల్లో మొన్నటివరకు కొంత మేర పరిస్థితి మెరుగ్గానే కనిపించింది. కానీ, ఆంధ్రప్రదేశ్ కు కూడా కరోనా మహమ్మారి పాకింది. నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మధ్యే ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా వున్నట్టు తేలింది. దీంతో ఆ యువకుడు నివసించే ప్రాంతంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు, ఇటలీ నుంచి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశాడనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇక తెలంగాణలో కరోనా కట్టడిలోనే ఉన్నా..జనంలో మాత్రం కొంత ఆందోళన నెలకొని ఉంది. వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో... శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రతీ ప్రయాణికుడికి ధర్మల్‌ స్క్రీన్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టుగా కనిపిస్తే.. వెంటనే హాస్పిటల్‌కు తరలించేందుకు రెండు 108 అంబులెన్స్ లు సిద్ధం చేశారు. నిన్న ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఒక్కరికి కూడా సోకలేదని క్లారిటీ ఇచ్చారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి రెండుసార్లు చేసిన పరీక్షల్లో... ఫలితం నెగెటివ్‌గా వచ్చిందని.. త్వరలోనే అతణ్ని డిశ్చార్జి చేస్తామని తెలిపారు. గతంలో వైరల్‌ జ్వరాలు వచ్చిన వారికి అందించిన వైద్యమే కరోనా రోగులకూ అందిస్తున్నామన్నారు.

హైటెక్ సిటీలోని ఐటీ సెక్టార్ కరోనా ప్యానిక్ నుంచి కోలుకుంటోంది. ఐటీ సెక్టార్ లో కరోనా పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాం అన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ప్రపంచం లో ఎక్కడ లేని విధంగా కరోనా పై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి కో ఆర్డినేషన్ కమిటీ తో చర్యలు చేపడుతున్నాం అని తెలిపారు.

గత వారం సోషల్ మీడియా లో జరిగిన ప్రచారంతో ఐటీ సెక్టార్ కంగారు పడ్డారు. దీంతో కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై పోస్టర్ విడుదల చేశారు. ఇక చైనా, దుబాయ్ తో పాటు ఇతర కరోనా బాధిత దేశాల నుండి వచ్చే వారు 14 రోజులు కచ్చింతగా వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఐటీ ప్రతినిధులు తెలిపారు.

కరోనా వైరస్ తో ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో కంగారు పడాల్సిన అవసరం లేకున్నా..ముందస్తు జాగ్రత్త చర్యల్లో మాత్రం నిర్లక్ష్యం వహించొద్దని అధికారులు సూచిస్తున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ కోసం ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు.

Tags

Next Story