బీజేపీ గూటికి చేరిన జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు

బీజేపీ గూటికి చేరిన జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు షాకిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ గూటికి చేరారు. ఆ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సింధియా.. కాసేపు బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు.

జ్యోతిరాదిత్య సింధియాకు పార్టీ కండువా కప్పి.. ప్రాథమిక సభ్యత్వ రశీదు అందజేశారు జేపీ నడ్డా. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. సింధియా రాకతో మధ్యప్రదేశ్ లో బీజేపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను బీజేపీలోకి ఆహ్వానించిన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు జ్యోతిరాదిత్య సింధియా. దేశ భవిష్యత్తు ప్రధాని మోదీ చేతుల్లో భద్రంగా ఉందన్నారు. తన తండ్రి మరణం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం.. ఈ రెండూ తన జీవితాన్ని మార్చేసిన ఘటనలని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన అంతమ లక్ష్యమని, దాని కోసమే బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు తనను ఎంతో ఆకర్షించాయని చెప్పారు. నాయకత్వలేమితో, ఓటములతో, పార్టీలో కుమ్ములాటతో సతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీలో ప్రజలకు సేవచేసే పరిస్థితి లేదని అన్నారు. పార్టీని ముందుండి నడిపిస్తూ, ప్రచారాన్ని భుజానకెత్తుకుని మోస్తున్న యువతకు అధిష్టానం మొండిచేయి చూపుతోందని విమర్శించారు.

అలాగే మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సైతం సింధియా విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కమల్‌నాథ్‌ సర్కార్‌ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి చేసేందుకు బీజేపీకి తనకు అవకాశం కల్పించిందని, ఆ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా నాయకత్వంలో దేశాభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని అన్నారు. వారి నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

18 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియా.. మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. సింధియాతో పాటు 22 మంది అనుచర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడారు. దీంతో 15 నెలల కమల్ నాథ్ సర్కార్ కుప్పకూలే స్థితికి చేరుకుంది. ఇక, జ్యోతిరాదిత్య బీజేపీలో చేరిపోవడంతో, భోపాల్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన నేమ్ ప్లేట్ తొలగించారు.

జ్యోతిరాదిత్య సింధియా చేరికను పలువురు బీజేపీ నేతలు స్వాగతించారు. జ్యోతిరాదిత్య రాకతో మధ్యప్రదేశ్ లో బీజేపీ మరింత బలపడుతుందని.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షడు వి.డి. శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

జ్యోతిరాదిత్య బీజేపీలో చేరటాన్ని ఆయన మేనత్త, ఆ పార్టీ ఎమ్మెల్యే యశోధర రాజే స్వాగతించారు. జాతీయ అవసరాల దృష్ట్యా జ్యోతిరాదిత్య సింధియా రాకను వాపసీతో పోల్చారు. జన్‌ సంగ్‌, బీజేపీలో తన తల్లి రాజ్‌మాత విజయె రాజే సింధియా కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా యశోధరా రాజే గుర్తు చేసుకున్నారు.

ఇదిలావుంటే, జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. సింధియాను కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవించందని అన్నారు ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్. పార్టీని వీడేముందు కనీసం ఆ గౌరవంతోనైనా ఆలోచించాల్సి వుండాల్సిందన్నారు.

ఇదిలావుంటే, పార్టీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు సముచిత స్థానం కల్పించేందుకు బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఆయనను మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేస్తారని భావిస్తున్నారు. మంగళవారం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను కలిసిన సింధియా.. వారి హామీ మేరకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీంతో జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story